ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 31, 2020 , 00:55:59

బాలుడి వైద్యానికి కేటీఆర్‌ భరోసా

బాలుడి వైద్యానికి కేటీఆర్‌ భరోసా

డయాబెటిస్‌తో బాధపడుతున్న  విష్ణుకు రూ. 1.50 లక్షల ఎల్‌వోసీ మంజూరు

నిమ్స్‌ దవాఖానలో చికిత్స  

గంభీరావుపేట: పుట్టిన కొద్ది నెలలకే షుగర్‌ వ్యాధిన పడి అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్షా50 వేల ఎల్‌వోసీని మంజూరు చేశారు. గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన ఎడ్ల బాబు-రాజమల్లవ్వ దంపతుల కుమారుడు విష్ణు (12) పుట్టిన కొద్ది నెలల్లోనే షుగర్‌ వ్యాధి బారిన పడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన బాబు ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. రాజమల్లవ్వ కూలీ పని చేసుకుంటూ బాలుడికి చికిత్స చేయిస్తున్నది. బాలుడి శరీరంలో షుగర్‌ తీవ్రత ఎక్కువై క్రమంగా కిడ్నీ సంబంధిత వ్యాధికి దారితీసి అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడిని తల్లి చికిత్స కోసం నిమ్స్‌ వైద్యశాలకు తీసుకుపోయింది. చికిత్సకు సుమారు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజమల్లవ్వ గ్రామానికి చెందిన జిల్లా రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పురం అనీల్‌రావుకు తన గోడును వెల్లబోసుకున్నది.  ఆయన వారి పరిస్థితిని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ బాలుడికి మెరుగైన వైద్యం కోసం రూ.లక్షా50 వేల ఎల్‌వోసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) నిమ్స్‌ వైద్యశాలకు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని బాలుడి తల్లిదండ్రులు చేతులెత్తి దండం పెడుతున్నారు.