గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 28, 2020 , 01:01:13

మాదిగలపై మనువాదుల దాడి

మాదిగలపై మనువాదుల దాడి

బండి సంజయ్‌ బాధ్యత వహించాలి

టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

రాజన్నసిరిసిల్ల,నమస్తేతెలంగాణ/సిరిసిల్ల టౌన్‌: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో మనువాదుల ముసుగులో దళితులపై దాడులు జరుగుతున్నాయని టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని మాదిగకాలనీకి వెళ్లిన ఆయన, బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రామోజీపేటలో దళితులపై జరిగిన దాడితో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాదులు కక్షపూరితంగా ఇండ్లపైకి వచ్చి దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో 8 మందికి పైగా గాయాలపాలయ్యారని, ఇండ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బహుజనులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టాలని తీర్మానించారని, అది జీర్ణించుకోలేని అగ్రవర్ణాల మనువాదులు ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. దళితులపై ఇలాంటి దాడులు చేయడం బాధాకరమైన చర్యగా వర్ణించారు. ఈ దాడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీజేపీ మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డిని బాధ్యులను చేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కొండ శంకర్‌, నాంపల్లి బాబురావు, శ్రీనివాస్‌, సంపత్‌, ప్రభు తదితరులున్నారు.