సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 28, 2020 , 01:01:12

కేశాలు కాసులు కురిపించేనా..?

కేశాలు కాసులు కురిపించేనా..?

రాజన్న ఆలయంలో తలనీలాలకు నేడు వేలం 

నాలుగోసారి సిద్ధమవుతున్న ఆలయ అధికారులు

కరోనా నేపథ్యంలో బిడ్‌ తగ్గించాలంటున్న కాంట్రాక్టర్లు

వేములవాడ, నమస్తే తెలంగాణ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి తిరుమల తిరుపతి తర్వాత అత్యధికంగా భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. రాజన్న ఆలయంలో 2020-22 సంవత్సరానికి గాను తలనీలాల సేకరణ హక్కుకు మార్చి నాటికే టెండర్‌ గడువు ముగియగా ఇప్పటికే మూడు సార్లు వేలం నిర్వహించారు. చివరిగా మార్చి 27న వేలం నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. తిరిగి ఈ నెల 28న నాలుగోసారి నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక స్వామివారి ఆదాయంలో తలనీలాల ద్వారా సమకూరేది సింహభాగమైనా ప్రస్తుత పరిస్థితుల్లో వేలం బిడ్‌ తగ్గించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 2018-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.13.64కోట్ల ఆదాయం వచ్చింది. ఆన్‌లైన్‌ టెండర్‌, పేపర్‌, వేలం ద్వారా మూడు విధాలుగా టెండర్‌ను నిర్వహిస్తామని, ఇందులో ఎక్కువగా వచ్చే బిడ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.

తలనీలాల ద్వారా భారీగా ఆదాయం

రాజన్న ఆలయానికి తలనీలాల ద్వారా 2018-20 కాలానికి గాను ఇప్పటి వరకు ఏడాదికి సుమారు రూ.7కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నది. 2008-10లో రూ.2.62కోట్ల ఆదాయం రాగా 2010-12లో రూ.5.45కోట్లతో దాదాపు 3కోట్ల ఆదాయం పెరిగింది. ఆ తర్వాత 2012-14 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాయత్రి ఎంటర్‌ప్రైజెస్‌ రూ.12.5కోట్లకు టెండర్‌ దక్కించుకోగా ఒక్కసారిగా స్వామివారికి రెండింతల ఆదాయం సమకూరింది. 2014-16లో హైదరాబాద్‌కు చెందిన ఎల్లయ్య ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూ.12.20కోట్లకు దక్కించుకోగా అత్యంత స్వల్పంగా ఆదాయం పెరిగింది. ఇక 2016-18 సంవత్సరంలో 13.14కోట్లకు హైదరాబాద్‌కు చెందిన వికాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ తలనీలాల సేకరణ హక్కులు పొందగా స్వామివారికి రూ.కోటి ఆదాయం ఎక్కువగా సమకూరింది. 2018-20 ఆర్థిక సంవత్సరంలో మహేందర్‌గౌడ్‌ అనే కాంట్రాక్టర్‌ రూ.13,64,05,116కు దక్కించుకున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్‌లో సరైన ధర లేకపోగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయాలకు కూడా భక్తుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంటుండగా వేలం బిడ్‌ తగ్గించి ఇవ్వాలని కాంట్రాక్టర్లు ఇప్పటికే ఆలయ అధికారులను కోరారు. 

టెండర్లకు చెల్లించిన నగదు ఇవ్వాలని వినతి

రాజన్న ఆలయంలో ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూడా తమకు నగదు తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులను వినతిపత్రం ద్వారా వేడుకున్నారు. ఫిబ్రవరిలోనే రాజన్న ఆలయంలో కొబ్బరికాయలు, బెల్లం అమ్ముకునే హక్కు, స్వామివారి ఆలయంలో ఒడిబియ్యం, బెల్లం, ఎండుకొబ్బరిని పోగు చేసుకునే హక్కులకు గానూ టెండర్లు నిర్వహించారు. వీరికి ఏప్రిల్‌ 2020 నుంచి హక్కులు కల్పించాల్సి ఉండేది. ఇక ఇందులో కాంట్రాక్టర్లు కొబ్బరికాయలు పోగు చేసుకునే హక్కుకు గానూ రూ.కోటీ 6లక్షలు, మరో కాంట్రాక్టర్‌ రూ.32లక్షలు, ఇంకొకరు కూడా నగదు చెల్లించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని నెలల పాటు ఆలయం మూసేయడంతో గుత్తేదారులు తాము చెల్లించిన నగదును తిరిగి ఇప్పించాలని, టెండర్‌ కూడా రద్దు చేయాలని ఇప్పటికే ఆలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మార్చి18 నుంచి ఆలయం మూసేయడంతో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి తలనీలాలు పోగుచేసుకునే హక్కును పొందిన కాంట్రాక్టర్‌ కూడా మిగిలిన 12రోజుల నగదును తనకు తిరిగి ఇప్పించాలని ఆలయ అధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశారు.

మూడు హక్కులకు వేలం 

కరోనా నేపథ్యంలో వాయిదాపడిన లీజుకు సంబంధించిన వేలాన్ని ఈ నెల 28న నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో తలనీలాల సేకరణ, ప్రధాన ఆలయంలో కొబ్బరిచిప్పలు పోగుచేసుకునే హక్కు, పాదరక్షలు భద్రపరిచేందుకు గాను మూడు టెండర్లకు వేలం నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మూడు విభాగాల్లో టెండర్‌, వేలం ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 


నాలుగోసారి వేలం నిర్వహిస్తున్నాం

తలనీలాలు పోగు చేసుకునే హక్కు ద్వారా స్వామివారికి గత ఆర్థిక సంవత్సరం నాటికి అధికంగానే ఆదాయం సమకూరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి బుధవారం వేలం నిర్వహిస్తున్నాం. మూడు విభాగాల్లో టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో పాటు మరో రెండింటికి కూడా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరిస్థితులను అంచనా వేసి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తాం. 

-కృష్ణప్రసాద్‌, రాజన్న ఆలయ ఈవో