శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 27, 2020 , 05:41:05

చిరుధాన్యాలతో ఆరోగ్య సమాజం

చిరుధాన్యాలతో ఆరోగ్య సమాజం

  •  శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి 
  •   పోత్గల్‌లో సిరి చిరుధాన్యాల ఉత్పత్తుల కంపనీకి  భూమిపూజ

సిరిసిల్ల/ముస్తాబాద్‌: చిరుధాన్యాలను ఆహారం గా తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. సోమవారం ఆయన ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లో సమీకృత చిరుధాన్యాల ఆహార తయారీ ఉత్పత్తుల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్‌ మండలి చైర్మన్‌ తన్నీరు రంగారావు, డైరెక్టర్‌ బోయినపల్లి శశిధర్‌రావుతో కలిసి వేదమంత్రోచ్ఛరణలతో భూమిపూజ చేశారు. అనంతరం చినజీయర్‌ స్వామి జ్యోతి ప్రజల్వన చేసి మాట్లాడారు. ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ ఉంటుందని, పాశ్చాత్య ప్రభావం మనిషి జీవితాన్ని విషతుల్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. రసాయనాలతో తయారవుతున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారని వివరించారు. రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై రైతులు దృష్టిసారిస్తే ప్రభుత్వం చేయూతనందిస్తుందని సూచించారు. నియంత్రిత పంటల సాగుతో వ్యవసాయంలో మార్పు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. పోత్గల్‌ గ్రామంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి తన్నీరు గోపాల్‌రావు సేవలు తనకు స్ఫూర్తినిచ్చాయని, ఆయన ఆలోచనతోనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ తన్నీరు రంగారావు పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్‌ బోయినపల్లి శశిధర్‌రెడ్డి  మానవాళి రసాయనాల బారిన పడిన సంఘటనలను వివరించారు.

పంట మార్పిడితో రైతాంగానికి మంచి ఆదాయం వస్తుందని అన్నా రు. అనంతరం పోత్గల్‌లోని శ్రీ సీతారామాలయాన్ని చినజీయర్‌స్వామి సందర్శించారు. అక్కడి నుంచి పోత్గల్‌ సహకార సంఘంలో కారు రుణం పొందిన లబ్ధిదారుడికి తాళాన్ని అందించారు. పోత్గల్‌ సహకార సంఘం రైతులకు అందిస్తున్న సేవలు, సిరి ధాన్యాల ఉత్పత్తులను టెస్కా బ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు చినజీయర్‌ స్వామికి వివరించారు. ఎంపీపీ జనగామ శరత్‌రావు, సర్పంచ్‌ తన్నీరు గౌతంరావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి, సిరికొండ ప్రభాకర్‌రావు, మారేటి వంశీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.