మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 22, 2020 , 02:31:40

వెంకన్న క్షేత్రం.. బ్రహ్మోత్సవ శోభితం

వెంకన్న క్షేత్రం.. బ్రహ్మోత్సవ శోభితం

నేటి నుంచి బ్రహ్మాండనాయకుని ఉత్సవాలు 

24న స్వామివారి కల్యాణం

31న రథోత్సవం

ఏర్పాట్లు పూర్తి: ఈవో శ్రీనివాస్‌

సిరిసిల్ల కల్చరల్‌: పూర్వం తిరుపతి వెళ్లలేని భక్తులు సిరిసిల్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సందర్శించేవారు. సాక్షాత్తు తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం చేసుకున్నంతగా పులకించేవారు. అందుకే ఇక్కడ కూడా దేవదేవునికి పన్నెండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం నుంచి శ్రీశాల (సిరిసిల్ల) క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

లక్ష మందికి పైగా భక్తుల రాక.. 

ఆశ్వీయుజ శుద్ధసప్తమి నుంచి ఆశ్వీయుజ మాసం నిర్వహించడం ఆనవాయితీ. యేటా సుమారు లక్ష మందికి పైగా  బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. ఈ నెల 22 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

800 ఏళ్ల ఆలయ ప్రాశస్త్యం

సుమారు 800 ఏళ్ల క్రితం సిరిసిల్లలో కేశవనాథుని ఆల యం నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో మొగలాయిలు హిందూ దేవాలయాలపై విధ్వంసాలు జరుపుతూ ఇక్కడి మూలవిరాట్టును పగులగొట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విగ్రహం ఇప్పటికీ వాహనశాలలో భద్రంగా ఉంది. 

శ్రీవారి వాహనోత్సవాలు

వెంకన్న ఆలయంలో గురువారం ఉదయం 9 గంటలకు పులికాపుతో మొదలై రాత్రి 7గంటలకు పుణ్యహవాచనంతో పూర్తవుతుంది. 23న రాత్రి 8గంటలకు శేష వాహనం, 24న హంస వాహనం, 25న అశ్వ వాహనం, 26న చంద్ర వాహనం, 27న హనుమంత వాహనం, 28న ఆండాలమ్మ వారికి ఒడి బియ్యం, 29న గజ వాహనం, 30న పొన్న వా హనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు ఆలయ కమిటీ, అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేశారు. 31న రథోత్సవం, నవంబర్‌ 1న చక్రతీర్థం, 2న నాగబలి, పుష్పయాగం, దేవతా ఉద్వాసన, గ్రామబలి, రాత్రి 8గంటలకు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని అర్చకులు తెలిపారు.

భక్తులకు ఏర్పాట్లు..

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేసినం. లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. వారికి అనుకూలంగా ఏర్పాట్లు చేశాం. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. కొవిడ్‌-19 నేపథ్యంలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతి లేదు. బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలి.

- శ్రీనివాస్‌, ఆలయ ఈవో