శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 22, 2020 , 02:31:40

కాంగ్రెస్‌ నాయకురాలికి కల్యాణలక్ష్మి

కాంగ్రెస్‌ నాయకురాలికి కల్యాణలక్ష్మి

సిరిసిల్ల/వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. అందుకు ఉదాహరణే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ. కరోనా సమయంలోనూ పెద్ద సంఖ్యలో చెక్కులను అందజేస్తూ, తన పెద్ద మనసు చాటుకుంటున్నది. పార్టీలకతీతంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేస్తున్నది. ఈ నెల 15న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌ బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు వంగల రాజ్‌కుమార్‌ సతీమణి జలజ రెండేండ్ల క్రితం స్కూటీపై నుంచి కిందపడటంతో కాలుకు తీవ్రగాయమైంది. కరీంనగర్‌లో శస్త్రచికిత్స చేయించుకుని, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.46 వేలు మంజూరు చేసి ఆదుకున్నది. తాజాగా వేములవాడలోని గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ వార్డు కౌన్సిలర్‌ సుగూరి లక్ష్మి బుధవారం కల్యాణలక్ష్మి చెక్కు అందుకున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన లక్ష్మి-నాగభూషణం దంపతులు గత జూలై నెలలో తమ కూతురు హారికకు వివాహం చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి రూ.లక్షా 116ల విలువైన చెక్కు మంజూరుగా కాగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి బుధవారం వారికి అందజేశారు.

పెద్దన్నలా సాయంజేసిండు..

నిరుపేదల ఇండ్లలో పెండ్లి అంటే పెద్ద ఖర్చు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినంక కల్యాణలక్ష్మి పథకం తెచ్చి నిరుపేద ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నలా సాయంజేస్తున్నడు. మా కూతురు హారిక పెండ్లికి కూడా సాయం చేయడం సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారు పొందుతున్నారనడానికి నేనే నిదర్శనం.

- సూగురి లక్ష్మి, కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్‌