ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 22, 2020 , 02:31:39

ఇంగ్లిష్‌ ఈజీ

ఇంగ్లిష్‌ ఈజీ

మంత్రి కేటీఆర్‌ సూచనలతో డిక్షనరీ రూపకల్పన

‘గివ్‌ తెలంగాణ’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  సిరిసిల్లలో ఉచితంగా పంపిణీ 

జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికీ అందజేత 

ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థీ గ్లోబల్‌ సిటిజన్‌గా ఎదగాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. తానే స్వయంగా సూచనలు, సలహాలు ఇస్తూ సరళ భాషలో.. సులభంగా అర్థమయ్యేలా ఓ డిక్షనరీని తయారు చేయించారు. వీటిని గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు.  

- సిరిసిల్ల ఎడ్యుకేషన్‌

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష తప్పనిసరి అయింది. కార్పొరేట్‌కు దీటుగా పేద విద్యార్థులు రాణించేందుకు మంత్రి కేటీఆర్‌ తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా తానే స్వయంగా సలహాలు, సూచనలు ఇస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా డిక్షనరీని రూపొందింపజేశారు. ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి ఇంటికి చేరేలా గీవ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిక్షనరీలను పంపిణీ చేయనున్నారు. మొదటగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉచితంగా అందజేస్తున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వనున్నారు.

ఇంగ్లిష్‌ మీడియం సక్సెస్‌..

ప్రతి నిరుపేద విద్యార్థికీ కార్పొరేట్‌ విద్యనందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్‌ ఆలోచన చేసి డిక్షనరీ రూపొందింపజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 111 హైస్కూల్స్‌ ఉండగా దాదాపు సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పలు పాఠశాలల్లో బోధనాపరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయుల బోధనకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తున్నది.  

90 పాఠశాలల్లో 13వేల డిక్షనరీలు..

ఈ విద్యా సంవత్సరం 90 ప్రభుత్వ పాఠశాలల్లో 13వేల ఆంగ్ల నిఘంటువులను పంపిణీ చేసేందుకు గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఇంటికీ చేరే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు స్వయం సందేహ నివృత్తికి ఎంతో ఉపయోగపడుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులకు రామన్న సందేశం..

డిక్షనరీ మొదటి పేజీలో విద్యార్థులనుద్దేశించి మంత్రి కేటీఆర్‌ సందేశమిచ్చారు. ‘మన విద్యావిధానంలో ఇంగ్లిష్‌ మీడియానికి తగిన ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంచడం మనం చేయాల్సిన పనుల్లో ఒకటి. ఇది మన తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందుకునేలా చేస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో నైపుణ్యాన్ని పెంచుకునే విషయంలో ముందుండి తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలి’ అంటూ కోరుకున్నారు. ‘నేనిచ్చిన చిన్న కానుక తెలుగు- ఇంగ్లిష్‌ డిక్షనరీ. మీరు పరీక్షలు బాగా రాసేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇష్టంగా కష్టపడి చదువుకోండి. గుడ్‌లక్‌' అని విద్యార్థులకు సూచించారు. 

శ్రద్ధ చూపితే పట్టు సాధించవచ్చు

విద్యార్థులు ఇంగ్లిష్‌పై చిన్ననాటి నుంచే అవగాహన కలిగి ఉండాలి. డిక్షనరీల ద్వారా తమ సందేహాలను సొంతంగా నివృత్తి చేసుకునే విధానం అలవర్చుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే పట్టు సాధించవచ్చు. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అనేక ఆధునిక వసతులను సమకూర్చాయి. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా వ్యాప్తంగా వందశాతం డిక్షనరీలు పంపిణీ చేస్తున్నాం. డిక్షనరీలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు.  

- డీ రాధాకిషన్‌, డీఈవో (రాజన్న సిరిసిల్ల)

ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది..

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నది. క్లాసులు వింటున్న సమయంలో వారికి వచ్చిన సందేహాలను వెంటనే నివృత్తి చేసుకునేందుకు ఈ డిక్షనరీ ఉపయోగపడుతుంది. వీటిని విద్యార్థులు సంపూర్ణంగా వినియోగించుకుంటే ఆంగ్లభాషపై అవగాహన వచ్చి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

- పురుషోత్తం, స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌ (సిరిసిల్ల ప్రభుత్వ బాలుర పాఠశాల) 

ఎక్కడైనా రాణించవచ్చు

తెలుగుతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తేనే ఎక్కడైనా రాణించవచ్చు అని మా సారు చెప్పిండు. మాకు ఇంగ్లిష్‌ డిక్షనరీలు ఇచ్చిన్రు. చదివితే ఈజీగా అర్థమవుతున్నది. డిజిటల్‌ క్లాసులు నడుస్తున్నప్పుడు వచ్చే డౌట్లను డిక్షనరీ చూసి అర్థం చేసుకోవచ్చు. 

- దొంతుల పవిత్ర, పదో తరగతి (సిరిసిల్ల)

ఈజీగా అర్థమవుతున్నది.. 

నాకు ఇంగ్లిష్‌ నేర్చుకోవాలనుంది. నేను ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఉన్న ప్రతి అంశాన్ని ఒకటికి ఐదుసార్లు చదివేదాన్ని. ఆ పదాలను ఎలా అనడమో తెలుస్తుంది. కానీ, పూర్తి స్థాయిలో అర్థమయ్యేదికాదు. తోటి విద్యార్థులను అడిగితే చులకనగా చూస్తారనే భయంతో ఎవరినీ అడగకపోయేదాన్ని. ఇప్పుడు కేటీఆర్‌ సారు అందించిన డిక్షనరీతో ప్రతి పదాన్ని సులభంగా పలుకవస్తున్నది. ఈజీగా అర్థమవుతున్నది.  

- ఊరడి ప్రగతి, పదో తరగతి (సిరిసిల్ల) 

పరిజ్ఞానం పెంపొందించుకోవాలి..

డిక్షనరీ ద్వారా భాషా పరిజ్ఞానంతోపాటు ఆంగ్ల భాషపై అభిరుచి పెరుగుతుంది. ప్రస్తుత గ్లోబలీకరణ పరిస్థితుల్లో ఇంగ్లిష్‌పై పట్టుసాధించడం కీలకమైన అంశం. మంత్రి కేటీఆర్‌ సారు సూచన మేరకు స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం సంతోషకరం. విద్యార్థులు ప్రతి రోజు కొంత సమయాన్ని వెచ్చించి భాషాపరమైన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

- చేరాల ప్రభాకర్‌, ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ (గూడెం)