బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 21, 2020 , 02:19:34

ప్రగతి పథంలో పల్లెలు

ప్రగతి పథంలో పల్లెలు

సంక్షోభంలోనూ ఆగని సంక్షేమ పథకాలు

జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

కోనరావుపేట మండల సమావేశానికి హాజరు

కోనరావుపేట: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెలు ప్రగతి పథం లో దూసుకెళ్తున్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై, మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. శ్మశాన వాటికలు, డంప్‌యార్డులు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగించిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలు నిర్మిస్తూ రైతుబంధు, రైతుబీమా అందిస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు సహకారంతో గ్రామాల సమగ్రాభివృద్ధికి పాటుపడుదామని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించా రు. అంతకుముందు సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు చదివి వినిపించగా, సర్పంచులు, ఎంపీటీసీలు తమ సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. మర్తనపేట సర్పంచ్‌ వంశీకృష్ణారావు గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి మరమ్మతులు చేయించాలని కోరారు. సమస్య పరిష్కరిస్తామని ఏఈ సమాధానం ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువెళ్లగా, నష్టపరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జడ్పీ నిధులతో మండల కేంద్రంలోని మాచిన్‌ చెరువు వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ ప్రారంభించారు. ధర్మారంలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి పంచాయతీ తీర్మాణ పత్రాన్ని సర్పంచ్‌ అరుణ అందజేశారని సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో రామకృష్ణ, కో ఆప్షన్‌ సభ్యు డు అబ్దుల్‌ రషీద్‌, వైస్‌ఎంపీపీ వంగపల్లి సుమలత, సర్పంచ్‌ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహచారి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.