మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 15, 2020 , 02:01:42

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

  •  lజగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో మోస్తరు వాన 
  • lజలమయమైన లోతట్టు ప్రాంతాలు.. ఇండ్లలోకి నీళ్లు 

రాజన్న సిరిసిల్ల,/జగిత్యాల, నమస్తే తెలంగాణ/కరీంనగర్‌ కార్పొరేషన్‌: రెండురోజులుగా ఉమ్మడి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాలలో దంచికొట్టాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేలాది ఎకరాల్లో పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే పది వేలకుపైగా ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తుండగా, వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులకు భరోసా ఇస్తున్నారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ధీమానిస్తున్నారు.

కరీంనగర్‌లో జలదిగ్బంధం

కరీంనగర్‌ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌, విద్యానగర్‌, శివ థియేటర్‌ ఏరియా, రాంనగర్‌, భగత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరగా, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హుజూరాబాద్‌లోని చిలుకవాగు ఉప్పొంగడంతో రంగనాయకుల గుట్ట ఒడ్డెర కాలనీ, వెలమపల్లి, కనుకులగిద్ద, జూపాక, ధర్మరాజుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్‌ పట్టణంలోని మామిండ్లవాడ, గాంధీనగర్‌, గణేశ్‌నగర్‌లోని ఇళ్లలోకి నీరు చేరింది. గన్నేరువరం, గంగాధర, శంకరపట్నం, సైదాపూర్‌, ఇల్లందకుంట, వీణవంక సహా పలు మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది. వీణవంక మండలంలో నేలకొరిగిన వరిని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీపీ రేణుక పరిశీలించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి వద్ద మోయతుమ్మెద ఉగ్రరూపంతో ఇందుర్తి-కోహెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓగులాపూర్‌, ఇందుర్తి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో సరాసరి 5.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇల్లందకుంట మండలంలో అత్యధికంగా 9.043, ఆ తర్వాత   హుజూరాబాద్‌లో 8.55, చిగురుమామిడిలో 8.39, జమ్మికుంటలో 7.17 సెంటీమీటర్లు   నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శశాంక సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థలు, బ్యాంకులకు 14, 15వ తేదీల్లో సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సిరిసిల్లలో కుండపోత..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. జిల్లాకేంద్రంలో పలుచోట్ల రోడ్లు మునిగిపోగా, ఇండ్లలోకి నీరు చేరింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. నాలుగేండ్ల తర్వాత రెండు ఒడ్లు ఆనుకొని మానేరువాగు పరవళ్లు తొక్కుతున్నది. సిరిసిల్లలో వాగు ఒడ్డున గంగమ్మ గర్భాలయంలోకి నీరు చేరింది. బతుకమ్మ ఘాట్‌ పూర్తిగా మునిగిపోయింది. తాడూరులో నిర్మాణమవుతున్న డబుల్‌ డెక్కర్‌ బోట్‌ను మానేరువాగు నుంచి బయటకు తీసుకొనివచ్చారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరుకు చెందిన రైతు బెజ్జారపు అంజయ్య, తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌కు చెందిన రైతు గంటల ముత్తయ్య పొలాల్లోని బోరు మోటర్ల నుంచి నీరుపైకి ఉబికి వస్తున్నది. వర్షాల నేపథ్యంలో జిల్లా అంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే స్వయంగా లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. మానేరువాగుతోపాటు కరీంనగర్‌ రోడ్డులోని కొత్త చెరువును పరిశీలించి, సూచనలు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ అంజయ్య సహా అధికారులు గ్రామాల్లో పర్యటించారు. పాత ఇండ్లలో ఉండే వారిని, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 08723-233040నంబర్‌కు అత్యవసర పరిస్థితిలో కాల్‌ చేయాలని కమిషనర్‌ సమ్మయ్య ప్రజలకు వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపారు. కాగా, జిల్లాలో సరాసరి 38.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యధికంగా ఇల్లంతకుంట మండలంలో 67.1 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

పెద్దపల్లిలో ముసురు.. 

పెద్దపల్లి జిల్లాలో ఈదురు గాలులతో ముసురు కురిసింది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలకు జలకళ రాగా, వరి పంట పంట దెబ్బతిన్నది. కరీంనగర్‌ జిల్లాలో లోయర్‌ మానేరు డ్యాం గేట్లు ఎత్తగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. హుస్సేనిమియా వాగు పరవళ్లు తొక్కుతున్నది. జిల్లాలో సరాసరి 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా కమాన్‌పూర్‌ మండలంలో 29.6మిల్లీమీటర్లు నమోదైంది. కాగా, వర్ష బీభత్సానికి జిల్లాలోని 2,990 మంది రైతులకు సంబంధించిన 3,932 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 2,363 ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. 

జగిత్యాలలో మోస్తరుగా..

జగిత్యాల జిల్లాలో వర్షం తక్కువగానే పడింది. 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా సరాసరి 8.92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కేవలం కొడిమ్యాల మండలంలో మాత్రం భారీగా కురిసింది. 3.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెగడపల్లి, ధర్మపురి, మల్లాపూర్‌, జగిత్యాల రూరల్‌ తదితర మండలాల్లో కొన్ని చోట్ల వరి పొలాల్లో నీరు చేరింది. కాగా, జిల్లాలో వర్షాల విషయంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రవి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన, వాతావరణ కేంద్ర సూచన నేపథ్యంలో ఆయా మండలాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాబోయే 48 గంటల వ్యవధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ సూచన కేంద్రం వారు హెచ్చరించిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పాత ఇండ్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 513 చెరువులు ఇప్పటికే పొంగి పొర్లుతున్నందున వాటి మత్తడులను పరిశీలించాలని, గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.