ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 07, 2020 , 02:11:16

రైతన్న సేవలో ప్యాక్స్‌ పోతుగల్‌ డాట్‌ కాం

రైతన్న సేవలో ప్యాక్స్‌ పోతుగల్‌ డాట్‌ కాం

అన్నదాతల అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్న పోతుగల్‌ సహకారం సంఘానికి మరో ఖ్యాతి దక్కింది. కాలానికి అనుగుణంగా సాంకేతిక సేవలను అందించాలనే ఉద్దేశంతో సొంతంగా వెబ్‌ పోర్టల్‌ రూపొందించింది. చైర్మన్‌ తన్నీరు బాపురెడ్డి, సభ్యుల వినూత్న ఆలోచనలతో పురుడు పోసుకున్న వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఇటీవలే రైతాంగానికి అంకితం చేసింది. సేవలు, రుణాలతోపాటు సమస్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసి, దేశంలోనే తొలి సొసైటీగా రికార్డులకెక్కింది.

 సిరిసిల్ల/ముస్తాబాద్‌ : ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ సహకార సంఘాన్ని1987లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంఘం పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. 13 డైరెక్టర్‌ స్థానాలు ఉన్నాయి. దాదాపు 3వేల మంది సభ్యులు ఉన్న ఈ సంఘం, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే మోడల్‌ సొసైటీగా నిలిచింది. ట్రైనీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు 2018లో సందర్శించి ప్రశంసించారు. పోతుగల్‌ సహకార సంఘం వంద శాతం రుణాల రికవరీలో మూడు సార్లు ఉత్తమ సొసైటీ అవార్డును కూడా సొంతం చేసుకున్నది. 

సాంకేతిక దన్ను..

2013 నుంచి పోతుగల్‌ సహకార సంఘ చైర్మన్‌గా కొనసాగుతున్న తన్నీరు బాపురావు సంఘ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇటు రైతులకు ఆన్‌లైన్‌ సేవలను అందించాలనుకున్నారు. అందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవాలని అనుకున్నారు. హైదరాబాద్‌లో ఉండే తన మిత్రుడు క్రాంతితో కలిసి www.pacspothgal. com వెబ్‌సైట్‌ను రూపొందించారు. రైతులకు, సభ్యులకు అర్థమయ్యే రీతిలో వివరాలను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించారు. సహకార సంఘానికి వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం కాగా, ఈ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. 

ఇటీవలే ప్రారంభం..


సహకార వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని రచించిన పోతుగల్‌ సహకార సంఘం వెబ్‌పోర్టల్‌ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. గత నెల15న ప్రగతి భవన్‌లో టెస్కాబ్‌ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, పోతుగల్‌ సహకార సంఘం అధ్యక్షుడు తన్నీరు బాపురావుతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సహకార సంఘాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడాన్ని హర్షిస్త్తూ, సంఘ పాలకవర్గాన్ని అభినందించారు. 

వెబ్‌సైట్‌లోకి ఇలా..

పోతుగల్‌ సహకార సంఘం రూపొందించిన వెబ్‌సైట్‌ www.pacspothgal.com లోకి లాగిన్‌కాగానే తెరపై పీఏసీఎస్‌ పోతుగల్‌ అని ఇంగ్లిష్‌లో, ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ పోతుగల్‌' తెలుగులో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, సొసైటీ చైర్మన్‌ బాపురావు తదితరుల ఫొటోలతో ఉన్న పేజీ కనిపిస్తుంది. ఈ పేజీలోనే కుడి వైపున తెలుగు/ఇంగ్లిష్‌ భాషను ఎంచుకోనే వీలుంటుంది. ఈ పేజీలో రుణాలు, సేవలు, సంఘం విజయాలను తెలిపే ఆప్షన్లు ఉన్నాయి. ఏ వివరాలు కావాలంటే వాటిపై క్లిక్‌ చేస్తే పూర్తి సమాచారం అందుతుంది. ఈ పేజీలోనే పాలకవర్గం ఫోటోలు కనిపిస్తాయి. అంతేకాకుండా కుడివైపున ఉన్న గడిని క్లిక్‌ చేస్తే సంఘం వివరాలు, ప్రాజెక్ట్‌లు, మీడియా, గ్యాలరీ, సంఘం టీం, సంప్రదింపుల సమాచారం, అభిప్రాయం(ఫీడ్‌బ్యాక్‌) తదితర ఆప్షన్లను చూడవచ్చు. అవసరమున్న చోట క్లిక్‌ చేస్తే వెంటనే సమాచారం ప్రత్యక్షం అవుతుంది.  

ఎన్నో ప్రయోజనాలు..

సంఘ సభ్యులకు వెబ్‌పోర్టల్‌ ఎన్నో ప్రయోజనాలు కల్పించనున్నది. పోతుగల్‌ సొసైటీ అందిస్తున్న రుణాలు, వాటికి సంబంధించిన ప్రక్రియను, ఇతర సేవలను నిక్షిప్తం చేసింది. సహకార సంఘం పరిధిలో నిర్వహించే పెట్రోల్‌ బంక్‌లు, త్వరలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఏటీఎం నిర్వహణ, సంఘ కార్యాలయ భవన నిర్మాణాల నిర్వహణ వంటి సమాచారాన్ని అందులో పొందుపరిచారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాలు, ఆదాయం వివరాలను పొందుపరిచారు. వీటితో పాటు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే లాకర్లు, సంఘం చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను కూడా పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా రైతుకు అందిస్తున్న సేవలను ప్రపంచంలో ఏ మూల నుంచైనా తెలుసుకోవచ్చు. అలాగే ఏ రోజుకారోజు ఎరువులు, విత్తనాల, స్టాక్‌ వివరాల గురించి రైతులు సమాచారం పొందవచ్చు.  

త్వరలో డాష్‌బోర్డ్‌లు.. 

సంఘ సభ్యులు రుణం పొందినప్పుడు లేదా ఇతర లావాదేవీలు నిర్వహించినప్పుడు వివిధ ధ్రువపత్రాల జిరాక్స్‌లు అవసరమవుతుంటాయి. కాగిత రహిత సేవలను అందించేందుకు రానున్న రోజుల్లో డాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్‌ బాపురావు వెల్లడించారు. ప్రతి సంఘ సభ్యుడికి కోడ్‌ కేటాయిస్తారు. అందులో సభ్యుడికి సంబంధించిన పూర్తి వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. దాని ద్వారా కాగితాలు లేకుండానే రుణాలు అందించే ప్రక్రియను నిర్వహిస్తారు.

సభ్యులకు మెసేజ్‌లు..

ప్రతి సంఘ సభ్యుడు తమ ఫోన్‌నంబర్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే, వారికి సంఘానికి సంబంధించిన లావాదేవీలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతారు. సభ్యుడు తీసుకున్న రుణం చెల్లించే వాయిదాల సమాచారాన్ని రెండు రోజుల ముందే వారి ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పంపిస్తారు. బకాయి ఉంటే కూడా చెల్లించాల్సిన గడువును అందులో తెలుపుతారు. రుణం చెల్లించిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలు కూడా పంపనున్నారు. సహకార సంఘం సేవలపై సంఘ సభ్యులు తమ ఫీడ్‌ బ్యాక్‌ (అభిప్రాయం)ను కూడా తెలిపే అవకాశం ఉంది. వాటిని కూడా స్వీకరించి, రైతులకు ఉపయోగం ఉంటే అమలు చేయనున్నారు.

ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం..

ప్రపంచీకరణలో భాగంగా పల్లె ముంగిట్లోకి సాంకేతికతను అందించాలని పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రయత్నించాను. సంఘంలో పారదర్శకతను సభ్యులకు, ప్రపంచానికి చాటాలనుకున్నాను. సేవలు, రుణాలు, సంఘం అభివృద్ధిని పొందుపరిచేలా నా మిత్రుడు క్రాంతితో కలిసి వెబ్‌ సైట్‌ రూపొందించి మంత్రి కేటీఆర్‌, టెస్కాబ్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశాం. దీని ద్వారా దాపరికాలు లేకుండా యూరియా, విత్తనాల నిల్వలు, రుణాలు తదితర అంశాలను వెల్లడిస్తాం. సంఘ సభ్యులు, రైతులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. దేశంలోనే వెబ్‌సైట్‌ రూపొందించిన సంఘంగా పోతుగల్‌ సొసైటీ ఉండడం గర్వకారణంగా ఉంది. పాలకవర్గంతో కలిసి ఆదర్శవంతమైన సంఘంగా తీర్చిదిద్దుతాం.- తన్నీరు బాపురావు, పోతుగల్‌ సహకార సంఘం అధ్యక్షుడు

విప్లవాత్మక మార్పులు తెచ్చాం

గతంలో సహకార సంఘాలంటే ప్రజల్లో చిన్న చూపు ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలతో సంఘాలు అభివృద్ధి చెందాయి. మా సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో పాలకవర్గం బాగా పనిచేస్తున్నది. ఇప్పటికే సంఘంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతాంగానికి మరింత దగ్గరయ్యేందుకు పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఖాతాదారులకు నమ్మకం కలిగిస్తున్నాం. రెండు పెట్రోల్‌ పంపులు, గోదాములు, ఎరువుల విక్రయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో పాటు వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య రుణాలను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందిస్తున్నాం. సంఘంలో జరిగే ప్రతి విషయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండడంతో సంఘంపై మరింత నమ్మకం ఏర్పడింది. - మేర్గు రాజేశంగౌడ్‌, పోతుగల్‌ సహకార సంఘం ఉపాధ్యక్షుడు