ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 05, 2020 , 03:17:20

వేగంగా ఆస్తుల నమోదు ప్రక్రియ

వేగంగా ఆస్తుల నమోదు ప్రక్రియ

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 34వేల 200 నిర్మాణాలు 

ప్రజలు వివరాలు అందించి సహకరించాలి 

జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి

ఏడు గ్రామాల్లో సర్వే పరిశీలన

బోయినపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం బోయినపల్లి, వెంకట్రావ్‌పల్లి, కొదురుపాక, విలాసాగర్‌, రత్నంపేట, దేశాయిపల్లి, మర్లపేట గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 34వేల 200 నిర్మాణాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంకా మరో 500 వరకు పెరుగవచ్చని చెప్పారు. సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటి యజమాని ఫొటో, ఆధార్‌నంబర్‌, ఇతర వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 255 గ్రామాల్లో ఈ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నదని వెల్లడించారు. కార్యదర్శులు సర్వేకు వచ్చినప్పుడు ప్రజలు అన్ని వివరాలు అందించి సహకరించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో నల్ల రాజేందర్‌రెడ్డి, ఎంపీవో గంగాతిలక్‌ ఉన్నారు.