బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 04, 2020 , 00:13:13

హలధారి సంబురం

హలధారి సంబురం

  • కొత్త చట్టంపై అన్నదాత ఆనందం 
  • కోరుట్ల నియోజకవర్గంలో 2వేల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ 
  • నాలుగు మండలాల నుంచి  వేలాదిగా రైతుల రాక 
  • గులాబీమయమైన కోరుట్ల- మెట్‌పల్లి రహదారి 
  •  సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి/కోరుట్ల:  సీఎం కేసీఆర్‌ తెచ్చిన కొత్త చట్టానికి మద్దతుగా కోరుట్ల నియోజకవర్గం నుం చి వేలాది మంది రైతులు కదిలారు. మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాల నుంచి రెండు వేల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ముందుగా ఆయా మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన  రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లా సరిహద్దు ప్రాంతమైన మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ శివారులో ని గండి హనుమాన్‌ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్‌ నడుపగా వేలాది ట్రాక్టర్లు, ఒకదాని తర్వాత ఒకటి కదిలాయి.

బండలింగాపూర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ మెట్‌పల్లి మీదుగా కోరుట్ల పట్టణ శివారులోని షిర్డీ సాయిబాబా ఆలయం వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారి గులాబీమయమైంది.  కోరుట్ల శివారు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమీపానికి చేరుకున్న ట్రాక్టర్‌ ర్యాలీకి స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్‌ సమీపం లో అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వందలాది మంది కార్యకర్తలు, రైతుల సమక్షంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.  ఆ ప్రాంతమంతా ‘జై కేసీఆర్‌.. జైజై కేసీఆర్‌' నినాదాలతో హోరెత్తింది. ఆయాచోట్ల కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు అన్నం లావణ్య, రణవేణి సుజాత, మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ చీటి వెంకట్రావు, ఎం పీపీ తోట నారాయణ, మారు సాయిరెడ్డి, భీమేశ్వరి, జడ్పీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, రాధ, భారతి తదితరులు పాల్గొన్నారు. 

రైతన్న దశాబ్దాల బాధలు తీర్చి.. బతుకునిచ్చిన సీఎం కేసీఆర్‌కు కర్షకలోకం జైకొడుతున్నది. కొత్త రెవెన్యూ చట్టానికి సంపూర్ణ మద్దతునిస్తూ కృతజ్ఞతలు చెబుతున్నది. ఊరూరా సంబురాలు, ప్రదర్శనలతో హోరెత్తిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నది. శనివారం కోరుట్ల నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి 2వేల ట్రాక్టర్లలో వేలాదిగా తరలివచ్చి ర్యాలీలతో హోరెత్తించింది. దారి పొడవునా జై కేసీఆర్‌ నినాదాలు.. ధూంధాం నృత్యాలు.. డప్పుచప్పుళ్ల మోత మోగించింది. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పాల్గొని.. ట్రాక్టర్‌ నడిపి హుషారెత్తించగా, కోరుట్ల-మెట్‌పల్లి రహదారి కర్షకశోభితమైంది.            

 - మెట్‌పల్లి/కోరుట్ల

మాది రైతు ప్రభుత్వం

కర్షకుల సమస్యలను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలతో భరోసా కల్పిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా రైతు బంధు, జీవిత బీమాను అమలు చేస్తున్నారు. పాత రెవెన్యూ చట్టంతో ఏం ప్రయోజనం లేదని భూ వివాదాలతో రైతులు సతమతమవుతున్నారని తెలుసుకొనే చారిత్రక కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చి ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతుల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకున్న పాపానపోలేదు. కానీ తెలంగాణ వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయి. రైతు బంధు, బీమా, సబ్సిడీపై యంత్రాలు, పంటలకు మద్దతు ధర, ఉచితంగా 24 గంటలు.. ఇలా ఒక్కటేమిటి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతూ రైతు పక్షపాతిగా ప్రభుత్వంగా నిలిపారు. 

- కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే