శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 03, 2020 , 05:52:55

పల్లె పాటే అతడి ప్రాణం

పల్లె పాటే అతడి ప్రాణం

జానపద గేయాలు, కవితలపై ఆసక్తి 

గాయకుడిగానూ రాణింపు 

అనేక అవార్డులు.. సత్కారాలు సొంతం

ఆదర్శంగా నిలుస్తున్న చందు

చిన్నతనం నుంచే అతడికి పల్లె పాటలంటే ప్రాణం.. కవిత్వం రాయడమంటే ఎంతో ఇష్టం.. పల్లెటూరి స్థితిగతులు, గ్రామీణుల జీవనవిధానంపై రచనలు చేయడంలో ఆయన ప్రత్యేకం.. మధురమైన కంఠంతో పల్లె జనులను ఉర్రూతలూగిస్తాడు.. విభిన్నమైన కవితలతో కట్టిపడేస్తాడు.. తాను ఎంచుకున్న రంగంలో రోజురోజుకూ రాటుదేలాడు.. ఇప్పటివరకు ఏకంగా వందకు పైగా జానపదాలు, కవితల రచనతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు..       - చందుర్తి   


చందుర్తి మండలంలోని అనంతపల్లి గ్రామానికి చెందిన జోగినపల్లి చందుది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు నర్సవ్వ, మల్లయ్య. మూడపల్లి జడ్పీ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నాడు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు. పాఠశాల చదివే రోజుల్లో దండి శంకరయ్య మాస్టారు చెప్పిన తెలుగు పద్యాలకు ఆకర్షితుడయ్యాడు. ఆయన స్ఫూర్తితో సాహిత్యంపై మమకారాన్ని పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యనభ్యసించే సమయంలో ‘జై కొట్టు.. జై కొట్టు సోదర.. మన జాతీయ జెండాకు జై కొట్టు సోదరా..’ అంటూ స్వతహాగా పాటరాసి పాడాడు. ఓ వైపు ఉన్నత విద్యను అభ్యసిస్తూ సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు రాశాడు. ప్రభుత్వ పథకాలు, జాతీయజెండాపై పలు పాటలు రాసి పలువురి మన్ననలు అందుకున్నాడు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి పై పాటలు రాశాడు. సమైక్య పాలనలో రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని పడ్డ బాధలపై రచించిన గేయం విశేష ఆదరణ పొందింది. ఈ పాటకు అప్పటి జడ్పీ చైర్మన్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. 2016లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా రాసిన బతుకమ్మ పాటలకు సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాముఖ్యతను తెలిపేలా పాట రాసి పాడాడు. 

అవార్డులు.. సత్కారాలు

చందు సాహిత్యంలో చేసిన సేవలకు గాను పలు అవార్డులు, బహుమతులు పొందాడు. 2018లో అనంతపూర్‌లో జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని, ఉత్తమ ప్రతిభ చూపి అవార్డు అందుకున్నాడు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ గొప్పతనాన్ని చాటుతూ రాసిన పాటకు ఉత్తమ బహుమతి లభించగా, అప్పటి జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ద్వారా అవార్డు, సత్కారం పొందాడు. మెట్‌పల్లిలో ఉగాది పండుగను పురస్కరించుకొని గాన కోకిల సాహిత్య సంఘం నిర్వహించిన పోటీల్లో పాల్గొని, ప్రథమ బహుమతి అందుకున్నాడు. ఇటీవల  ‘అక్షర శిల్పి’ అవార్డు మద్రాస్‌ హెల్త్‌ సొసైటీ నుంచి అందుకున్నారు


సినారె సాహిత్యం ఇష్టం

నేను ఇప్పటి వరకు వందకు పైగా జానపద గేయాలు, కవితలు, పాటలు రాసిన. సినారె సాహిత్యం, పోతన పద్యాలంటే నాకు చాలా ఇష్టం. ఒక వైపు కుటుంబ పోషణ కోసం వ్యవసాయ పనులు చేస్తున్న. మరోవైపు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, రచనలు చేస్తున్న.

- జోగినపల్లి చందు