గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Oct 02, 2020 , 02:29:30

రైతు బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి

రైతు బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌: మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక కృషితో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో సకల వసతులతో కూడిన రైతు బజార్‌ అందుబాటులోకి వచ్చిందని, రైతులు, విక్రయదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సూచించారు. గురువారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మయ్య, పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన రైతు బజార్‌, బతుకమ్మఘాట్‌, కొత్త బస్టాండ్‌ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల పట్టణంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన రైతు బజార్‌ను మంత్రి కేటీఆర్‌ అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. రైతులు, విక్రయదారులు, కొనుగోలుదారుల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారుల సమన్వయంతో రైతు బజార్‌ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం బతుకమ్మఘాట్‌ను సందర్శించి మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా నిలిచేలా సిరిసిల్ల మానేరుతీరంలో బతుకమ్మఘాట్‌ను నిర్మించామన్నారు. ఈ సారి బతుకమ్మ పండుగ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో రూ.23 లక్షల నిధుల వ్యయంతో విద్యుత్‌ దీపాల అలంకరణ, తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఈఈ వెంకటశేషయ్య, కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్‌, అన్నారం శ్రీనివాస్‌, యెల్దండి దేవదాస్‌, గెంట్యాల శ్రీనివాస్‌, వేముల రవి, కుడిక్యాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.