శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 02, 2020 , 02:29:49

కరోనా నియంత్రణకు సహకరించాలి

కరోనా నియంత్రణకు సహకరించాలి

కోనరావుపేట: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు కోరారు. మండలంలోని మామిడిపల్లి గ్రామంలో రెండో రోజు గురువారం కొనసాగిన కరోనా టెస్టింగ్‌ క్యాంప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతేనే బయటకు రావాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు. కరోనా బాధితులు ఆందోళన చెందకుండా వైద్య సిబ్బంది సూచనలు పాటించాలన్నారు. కాగా, గురువారం క్యాంపులో 125మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 24మందికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి మోహన్‌కృష్ణ తెలిపారు. గ్రామంలో మొత్తం 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, శుక్రవారం సైతం టెస్టింగ్‌ క్యాంప్‌ కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, మామిడిపల్లి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు సర్పంచ్‌ కొక్కుల భారత తెలిపారు. గ్రామస్తులు కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.

గంభీరావుపేట: మండలంలోని ముచ్చర్లలో గురువారం ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు సందర్శించారు. కరోనా టెస్టులు, వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య ఉప కేంద్రంలో రెండు రోజుల పాటు 306 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని తెలిపారు. జ్వరం, దగ్గు తదితర లక్షణాలు ఉన్నవారు నేరుగా మండల కేంద్రానికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ వంగ రాఘవేందర్‌రెడ్డి, మండల వైద్యాధికారి వెంకటేశ్‌, సీహెచ్‌వో రమేశ్‌, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

వీర్నపల్లి: మండలంలోని వన్‌పల్లి, శాంతినగర్‌ గ్రామాల్లో  గురువారం మొబైల్‌ కొవిడ్‌ టెస్ట్‌ సెంటర్‌ నిర్వహించగా, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో 200 టెస్టులు చేయడంపై వైద్య సిబ్బందిని అభినందించారు. డీఎస్‌వో మీనాక్షి, మండల వైద్యాధికారి ధర్మానాయక్‌, సర్పంచ్‌ జోగినిపల్లి లత, నాయకుడు మల్లేశం పాల్గొన్నారు.