గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 29, 2020 , 02:10:48

పరిశ్రమలకు పెద్దపీట

పరిశ్రమలకు పెద్దపీట

  • n నర్మాలలో 80 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
  • n  త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన
  • n టీఎస్‌ఐసీ ఎండీ,  వైస్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి 
  • n సిరిసిల్ల, నర్మాల,  జిల్లెల్లలో పర్యటన

సిరిసిల్ల రూరల్‌/గంభీరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈ వీ నరసింహారెడ్డి వెల్లడించారు.  ఈ మేరకు సోమవారం సీఈవో మధుసూదన్‌తో కలిసి తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట మండలం నర్మాల, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరులో పర్యటించారు. మొదట జిల్లెల్ల శివారులో వెయ్యి మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజీ గోదాం పనులను పరిశీలించారు. రాబోయే ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి, ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందులో రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, తదితర పంటలను నిల్వ ఉంచి, ఇతర ప్రాంతాల్లోకి ఎగుమతి చేసుకోవచ్చన్నారు. అనంతరం పెద్దూరులో అపెరల్‌, వీవింగ్‌ పార్క్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. అంతర్గత రోడ్లు ఇప్పటికే పూర్తి కాగా, 40షెడ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అపెరల్‌ పార్క్‌తో గార్మెంట్‌ రంగంలో సుమారు 500 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించవచ్చన్నారు. బెంగుళూరుకు చెందిన గోకుల్లాస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. తర్వాత నర్మాలలో పర్యటించారు. గ్రామ శివారులో 80 కోట్లతో 300 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థలం సేకరించామని, త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందన్నారు. 80 సంస్థలు ఈ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని చెప్పారు. న్యూట్రాన్‌ అనే దుబాయ్‌కి చెందిన కంపెనీ ఇక్కడ ఫుడ్‌ ఐటమ్స్‌ను తయారు చేసి, అమెరికాకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఏడాదిలో ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం పూర్తవుతుందని, దీంతో 170 మంది స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్లు సదానందం, మల్లారెడ్డి, సిబ్బంది ఉన్నారు.