శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Sep 24, 2020 , 01:38:14

ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

  • n ఎల్లంపల్లికి 2,28,703 క్యూసెక్కులు
  • n గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/తిమ్మాపూర్‌/బోయినపల్లి: వారం రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం 2,28, 703 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 25 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువన మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్‌లోకి విడుదల చేస్తున్నారు. 20.17టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 17.92 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  ఈ క్రమంలో పార్వతీ బరాజ్‌కు 2,28,790క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 60 గేట్లు ఎత్తి దిగువన మహదేవపూర్‌ మండలంలోని సరస్వతీ బరాజ్‌లోకి అంతే విడుదల చేస్తున్నారు. 8.83 టీఎంసీల సామర్థ్యం ఉన్న పార్వతీ బరాజ్‌లో ప్రస్తుతం 6.68 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

మానేరు పరీవాహకంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్‌ జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. బుధవారం 10,301 ఇన్‌ఫ్లో రాగా, ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీకి 15,794 క్యూసెక్కులు నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. 25.87 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారార్‌ జలాశయంలో ప్రస్తుతం 25.425 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. 

ఎల్‌ఎండీకి 32,809 క్యూసెక్కుల..

కరీంనగర్‌ జిల్లాలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువన ఎస్సారార్‌ నుంచి 15,620 క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు నుంచి 16,460 క్యూసెక్కులు, ఎల్‌ఎండీ పరీవాహక ప్రాంతాల నుంచి 729 క్యూసెక్కులు మొత్తం 32,809 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండడంతో 6 గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నా మని అధికారులు పేర్కొన్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 2500, తాగునీటి అవసరాల కోసం 309 క్యూసెక్కులు మొత్తం 32,809 క్యూసెక్కుల వదులుతున్నట్లు తెలిపారు.