శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 22, 2020 , 02:15:37

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

  • డీఆర్సీలో అదనపు కలెక్టర్‌  శ్యాం ప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పేదల నుంచి వినతులు వచ్చాయని, తమ మండలాల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు లబ్ధిదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో తీసి కేటాయిస్తారన్నారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు నోటు చేసుకుని వారం రోజుల్లో పరిష్కరించి, వారికి లేఖ ద్వారా తెలియజేయాలన్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలు పరిష్కరించాలే తప్పా కిందిస్థాయి అధికారులకు ఎండార్స్‌ చేసి చేతులు దులుపుకోవద్దని సూచించారు. వాటికి పరిష్కార మార్గాలు చూడాలని, పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలపాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్‌ చేసి సమస్యలు విన్నవించగా, పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్‌  నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటమాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి బుచ్చయ్య, జిల్లా సంక్షేమాధికారి శారద, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.