మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Sep 16, 2020 , 03:09:57

సహకార వ్యవస్థలో సరికొత్త అధ్యాయం

సహకార వ్యవస్థలో సరికొత్త అధ్యాయం

  • nపోతుగల్‌ సహకార సంఘం     వెబ్‌సైట్‌ ఏర్పాటు
  • nప్రగతి భవన్‌లో ప్రారంభించిన     ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌,      టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు
  • nపాలకవర్గాన్ని అభినందించిన మంత్రి 

ముస్తాబాద్‌: సహకార వ్యవస్థలో పోతుగల్‌ సంఘం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రైతులకు అందిస్తున్న సేవలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలుగా తెలుగు, ఆంగ్ల భాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించింది. కాగా, హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సొసైటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలందించడానికి పోతుగల్‌ సొసైటీ వెబ్‌సైట్‌ను రూపొందించి, దేశంలోని సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పెట్రోల్‌ బంకులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఏటీఎంలు, కార్యాలయ భవనాలు, ధాన్యం కొనుగోళ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, లాకర్ల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార సంఘాల్లో నూతన ఒరవడికి పోతుగల్‌ సంఘం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా సంఘంపై రైతులకు మరింత నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సహకార సంఘం చైర్మన్‌ తన్నీరు బాపురావు మాట్లాడుతూ సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, లావాదేవీలను వెబ్‌సైట్‌ (www.pacspothgal.com) ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. 2013లో తాను సంఘం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగా, అప్పుడు రూ.80 లక్షల నష్టాల్లో ఉందన్నారు. రైతులకు మెరుగైన సేవలందిస్తూనే, సంఘాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.20 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్నదని వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సహకారంతో సుమారు రూ.30 లక్షలతో మోడల్‌ భవన నిర్మాణం, సంఘం ఎదుట నిలువెత్తు రైతు విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.  రైతులకు ఆహ్లాదం పంచేలా కార్యాలయ ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలు, రెండు గ్రామాలకొక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, గోదాములు సైతం నిర్మించినట్లు వెల్లడించారు. సంఘం సిబ్బందికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. సంఘానికి రెండు పెట్రోల్‌ బంక్‌లు మంజూరు కాగా, ఒకటి ఏర్పాటు చేయగా, మరో బంక్‌ పనులు తుది దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షుడు మేర్గు రాజేశంగౌడ్‌, డైరెక్టర్‌ గన్నె నర్సింహులు, గన్నె మల్లమ్మ, వెన్నమనేని లక్ష్మణ్‌రావు, కట్ట బాపురావు, కుర్ర కిర్తన్‌, సురభి మాధవరావు, వాల హన్మంతరావు, బాల బాలయ్య, ఐనేని వెంకట్‌రెడ్డి, ఆవునూర్‌ సతీశ్‌చందర్‌రావు, బైరి బాలవ్వ పాల్గొన్నారు.logo