మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 16, 2020 , 03:09:58

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన

  •  ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
  • n సోమవారం అర్ధరాత్రి  నుంచి కుండపోత
  • n అత్యధికంగా మేడిపల్లిలో 16 సెంటీమీటర్లు
  • n పోటెత్తిన వరద.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • n జగిత్యాల, సిరిసిల్లలో కాలనీల్లోకి నీళ్లు

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఏకధాటిగా దంచికొట్టడంతో వాగులూ వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో అత్యధికంగా 16 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు, వేములవాడ మూలవాగు, హన్మాజిపేట, కోనరావుపేట మండలం మామిడిపల్లిలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు నిండి మత్తడి దూకడంతో లోతట్టు ప్రాంతమైన శాంతినగర్‌, మెహర్‌నగర్‌, అంబేడ్కర్‌నగర్‌ వార్డులు పూర్తిగా జలమయమయ్యాయి. సిరిసిల్ల- కరీనంగర్‌ రహదారిపై నీరు ప్రవహించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లెకాలనీలో వరద నీరు ఇండ్లలోకి రాగా, వాహనాలు, కార్లు నీట మునిగాయి. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తగా, గోదారి పరవళ్లు తొక్కింది. 

 కరీంనగర్‌ జిల్లాలోని కొత్తపల్లి, కరీంనగర్‌, గంగాధర, చొప్పదండి, మండలాల్లో భారీగా, మిగతా మండలాల్లో మోస్తరుగా వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే కొత్తపల్లిలో అత్యధికంగా 8.46 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్‌లో అర్బన్‌లో 6.82, చొప్పదండిలో 6.56, గంగాధరలో 6.40, కరీంనగర్‌ రూరల్‌లో 4.60, రామడుగులో 3.14, గన్నేరువరంలో 2.98, మానకొండూర్‌లో 1.92, తిమ్మాపూర్‌లో 1.07, చిగురుమామిడిలో 1.71, సైదాపూర్‌లో 1.43, శంకరపట్నంలో 2.12, వీణవంకలో 1.45, హుజూరాబాద్‌లో 1.94, జమ్మికుంటలో 2.33, ఇల్లందకుంటలో 1.23 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటలు పలు చోట్ల మత్తళ్లు దూకాయి.