శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 10, 2020 , 03:40:00

మా పాలిట దైవం సీఎం కేసీఆర్‌

మా పాలిట దైవం సీఎం కేసీఆర్‌

  • రాజన్న సిరిసిల్ల జిల్లా వీఆర్వోలు

కలెక్టరేట్‌: ఉద్యోగుల పాలిట దైవం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని వీఆర్‌వోలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌ వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి తెలంగాణ వీఆర్‌వోల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వీఆర్‌వోలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల గట్టుస్వామి మాట్లాడుతూ ఇన్నాళ్లు ఒక్కో వీఆర్‌వో అయిదు నుంచి ఆరు గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామ రెవెన్యూ అధికారిగా 2007 నుంచి 2020 వరకు విధులు నిర్వర్తిస్తున్న మమ్మల్ని బాధ్యతల నుంచి విముక్తి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ ఏ శాఖకు బదిలీ చేసినా తాము ఆనందంగా వెళ్లి విధులు నిర్వర్తిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై చాలా సంతోషంగా ఉన్నామన్నారు. అవినీతిని తొలగించేందుకు మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఏ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసినా సంతోషంగా వెళ్తామని, ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.  

పే స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్‌ఏల హర్షం

హుజూరాబాద్‌టౌన్‌: అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీఆర్‌ఏలను పే స్కేల్‌ ఉ ద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించడంపై హుజూరాబాద్‌లో మండల వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల అసోసియేషన్‌ హుజూరాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఆర్‌ కిరణ్‌, హుజూరాబాద్‌ మండల అధ్యక్షుడు బీ అంజలి, మండల ప్రధాన కార్యదర్శి పీ రాజు, నాయకులు సీహెచ్‌ నరేశ్‌ పాల్గొన్నారు.