శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 09, 2020 , 02:24:21

అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు

అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు

  • n ప్రైవేట్‌కు దీటుగా గైనిక్‌ పరీక్షలు
  • n జిల్లా దవాఖానలో పెరిగిన సాధారణ ప్రసవాలు
  • n ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి 

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నది. అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రైవేట్‌కు దీటుగా మెరుగైన చిక్సిత అందిస్తున్నది. కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి, పథకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువడంతో సాధారణ ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సర్కారు దవాఖానే శ్రీరామ రక్ష అంటూ బాలింతలు, గర్భిణులు చికిత్స కోసం తరలి రావడంతో జిల్లా దవాఖాన నిత్యం  కిటకిటలాడుతున్నది.

- సిరిసిల్ల టౌన్‌

తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సర్కారు దవాఖానలంటే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప అక్కడికి వెళ్లేందుకు సుముఖంగా ఉండేవారు కాదు. ప్రసవానికి వెళ్లినా దేవుడిపై భారం వేసి చేరేవారు. “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు”.. అనేది మునుపటి ముచ్చట నుంచి “సర్కారు దవాఖానే” శ్రీరామ రక్ష అనేలా తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నది. విడతల వారీగా సర్కారు దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తూ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ప్రాంతీయ దవాఖానను మొదలుకొని జిల్లా హాస్పిటల్‌ వరకు అన్ని చోట్ల అత్యాధునిక వైద్య సేవలు అమలులోకి తీసుకువస్తున్నది.

ఆధునిక హంగులు..

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పం తో మంత్రి కేటీఆర్‌ జిల్లా దవాఖానకు ఆధునిక హంగులు కల్పించారు. దశాబ్దాల కాలంగా ప్రజలు పడుతున్న అవస్థలు గమనించిన అమాత్యుడు రామన్న సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు జిల్లా హోదాను కల్పించారు. తద్వారా దవాఖానలో బ్లడ్‌బ్యాంకు, డయాలసిస్‌, ఐసీయూ, నవజాత శిశు కేంద్రంతో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. మల్టీసూపర్‌ సెషల్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకు రూ.159కోట్లు మంజూరు చేశారు. 

 అనతి కాలంలోనే అత్యధిక సేవలు

102 అమ్మఒడి పథకం గతేడాది జనవరిలో ప్రారంభమై జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. గర్భందాల్చిన మహిళలను ప్రతినెలా పరీక్షలతోపాటు ప్రసవించిన తర్వాత వారిని ఇంటికిచేర్చే వరకు 102ద్వారా ఉచితంగా వాహన సేవలు అందిస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వం జిల్లాకు నాలుగు వాహనాలను  కేటాయించింది. జిలా వైద్య ఆరోగ్యశాఖ, 102 ప్రోగాం అధికారులు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలను సమన్వ యం చేస్తూ లక్ష్య సాధనకు శ్రమించారు. దీంతో ఇప్పటి వరకు వీటి ద్వారా మొత్తం 5,720 ట్రిప్పుల్లో 13,144మంది గర్భిణులు, బాలింతలను సురక్షితంగా దవాఖానకు, ఇంటికి చేర్చా రు. గర్భిణులు, బాలింతలతోపాటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌                        చేయించుకునే వారికి సైతం ఈ సేవలు అందుబాటులోకి   తీసుకువచ్చారు.

కేసీఆర్‌ కిట్‌.. సూపర్‌ హిట్‌

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు సీఎం కేసీఆర్‌ అమలులోకి తెచ్చిన కేసీఆర్‌ కిట్‌ పథకం విజవయంతం గా కొనసాగుతున్నది. ఒకప్పుడు సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోయేవారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యాధునిక మౌలిక వసతుల కల్పించడంతో సర్కారు వైద్యంపై ప్రజల్లో భరోసా పెరిగింది. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు జిల్లా దవాఖానలో 7,801 మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు. వీరిలో 4,071 మంది మగ శిశువులు, 3,730 మంది ఆడ శిశువులు ఉన్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 237 ప్రసవాలు జరుగడమే సర్కారు దవాఖానలపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భావించవచ్చు. 

 మంచిగ చూస్తున్నరు.

నా పేరు సుజాత. మాది ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండా గ్రామం. నేను మొదటి నుంచి సిరిసిల్ల దవాఖానలోనే చూపించుకుంటున్న. ఇక్కడికి రాకముందు ఎలా చూస్తారోనన్న భయం ఉండేది. కానీ ప్రైవేట్ల కన్నా ఇక్కడ మంచిగ చూస్తున్నరు. నెలనెలా మందులిచ్చిండ్రు. అమ్మఒడి వాహనంలో ఇంటి నుంచి తీసుకొచ్చి పరీక్షల తర్వాత ఇంటి వద్ద దింపేవారు. రాత్రి సమయంలో నొప్పులు వచ్చినా వెంటనే డాక్టర్లు స్పందించి ప్రసవం చేసిండ్రు. పాప జన్మించింది. ఆరోగ్యంగా ఉంది.