ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 08, 2020 , 01:31:08

ప్రారంభమైన కోర్టు విధులు

ప్రారంభమైన కోర్టు విధులు

  • lఈ నెల 11 వరకు ప్రయోగాత్మకంగా నిర్వహణ
  • lమొదటి రోజు హాజరైన న్యాయవాదులు, పీపీలు, ఏజీపీలు

కరీంనగర్‌ లీగల్‌ : రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రయోగాత్మకంగా అన్ని కోర్టుల్లో విధులు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌-19 కారణంగా కోర్టులకు మార్చి నుంచి ఈ నెల 5 వరకు దశల వారీగా లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ వచ్చారు. ఈ సమయంలో ముఖ్యమైన సివిల్‌, క్రిమినల్‌ కేసులను మొదట ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించి విచారణ జరిపారు. అనంతరం ఫిజికల్‌ ఫైలింగ్‌కు అనుమతితో మొబైల్‌ వర్చువల్‌ కోర్టు ఏర్పాటుతో కేసులు విచారించారు. ఉమ్మడి జిల్లాకు వచ్చే సరికి కొందరు న్యాయవాదులు కోర్టులు ప్రారంభించాలని కోరగా, మరికొందరు ఒప్పుకోలేదు. న్యాయమూర్తులు కోర్టుల ప్రారంభానికి హైకోర్టుకు అనుమతి తెలుపగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా విధులు ప్రారంభించేందుకు పర్మిషన్‌ లభించింది. దీంతో సోమవారం కోర్టు విధులు ప్రారంభం కాగా, కేసుల లిస్టు లో ఉన్న న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో జిల్లా కోర్టుకు హాజరై వారి కేసుల్లో వాదనలు వినిపించారు. రాని వారి కేసులను వాయిదా వేశారు. కోర్టు ఆవరణలోకి న్యాయవాదుల వాహనాలు అనుమతించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా జడ్జిని కోరగా, నేటి నుంచి సెల్ఫ్‌ డ్రైవింగ్‌తో వచ్చిన వాటిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యే కేసులుంటే వాటి వివరాలను సంబంధిత కోర్టులో న్యాయవాదులు ఉదయం తెలపాలని, అదేరోజు వాటిని పరిష్కరించనున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఈ సందర్భంగా తెలిపారు. వీటికి సంబంధించి ప్రతి కోర్టులో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, సెటిల్‌ మెంట్‌ కేసుల్లో కక్షిదారులను అందులోకి అనుమతిస్తామని  పేర్కొన్నారు. అర్హత ఉన్న క్రిమినల్‌ కేసులను ఆయా కోర్టుల్లో అడ్మిషన్‌ చేయనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో కొవిడ్‌-19 నిబంధనల అమలుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోగా, మొదటి రోజు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులతో పాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ఏజీపీలు హాజరవడం గమనార్హం.