శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 07, 2020 , 01:44:46

పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దూరం

  •  ‘ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు

కార్పొరేషన్‌: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులు ప్రబలవని మేయర్‌ వై సునీల్‌రావు సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని 3వ డివిజన్‌లో ఆయన తిరిగి పలు ఇండ్ల ఆవరణలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్నామని, ప్రతి డివిజన్‌లో మున్సిపల్‌ సిబ్బందితో ఫాగింగ్‌ చేయిస్తున్నామన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నట్లు తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఆదివారం పది నిమిషాల సమయం కేటాయించి తమ ఇండ్ల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న సామగ్రిలో నీరు నిలిచి ఉంటే తొలగించాలని సూచించారు. ఇండ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం  వేయవద్దన్నారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్‌ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేయాలని కోరారు. ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గించాలని కోరారు. ప్రజలు పరిశుభ్రతను పాటిస్తేనే సీజనల్‌ వ్యాధులను అరికట్టగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌, నాయకులు ఎడ్ల అశోక్‌, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.