శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 07, 2020 , 01:44:54

‘ఉపాధి’తో పల్లెల్లో ప్రగతి

‘ఉపాధి’తో పల్లెల్లో ప్రగతి

  • ఈజీఎస్‌తో అభివృద్ధి పథాన గ్రామాలు n మెరుగుపడుతున్న మౌలిక వసతులు
  • n రైతులకు ప్రయోజకరంగా పలు యూనిట్లు n సత్ఫలితాన్నిస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం

ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు రైతులకు ప్రయోజనకరంగా పలు యూనిట్లు ఉండడంతో ఈ పథకం ద్వారా గ్రామాల్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈజీఎస్‌లో కేటాయించిన పలు పథకాలు పల్లెల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.  - సిరిసిల్ల

ఉపాధిహామీ పథకాన్ని విస్తరించడంతో వైకుంఠధామాలు, పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణం, చేపల చెరువుల తవ్వకాలు, పండ్ల తోటల పెంపకంతోపాటు పలు రకాల అవకాశాలు ఈ పథకం ద్వారా చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పనులకు అవకాశం కల్పించాయి. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించే పనులకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. 

సామూహిక ఇంకుడు గుంతలు

భూగర్భ జలాలను పెంపొందించడానికి, గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణకు సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్కో గుంత నిర్మాణానికి రూ. 4,096 చెల్లిస్తున్నారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణాలకు రూ.12,845 అందిస్తున్నది. జిల్లాలో ఉద్యమంలా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టారు. దీంతో డ్రైనేజీ వ్యవస్థ అవసరం లేకుండా, ప్రతి నీటి బోట్టునూ ఇంకుడు గుంతల్లో నిల్వ చేస్తున్నారు. 

చిన్న నీటి కుంటలు

భూగర్భజలాలను గణనీయంగా పెంచడానికి చిన్ననీటి కుంటలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రైతులు వ్యవసాయ భూమిలో నిర్మించుకునే కుంటకు రూ.2,72, 234 ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో వేతనం రూ.2, 47,491, సామగ్రి 24,743, ఉంటుంది. ఇందులో కూలీలకు 1,256 పని దినాలు కల్పిస్తారు. ఉటకుంట కట్ట పొడ వు గరిష్టంగా వంద మీటర్లు, కట్ట కింది భాగంలో గరిష్టంగా వెడల్పు 7.20మీటర్లు, పైభాగాన గరిష్టంగా 1.20 మీటర్లు, కట్ట ఎత్తు 2మీటర్లు ఉండాలి. కట్ట నిర్మాణంతోపాటు రాతితో అలుగు నిర్మాణాలు చేపట్టాలి.

కోళ్లఫారం..

ఉపాధి హామీ పథకంలో భాగంగా నిరుద్యోగ యువత కోసం కోళ్ల ఫారం షెడ్‌ నిర్మాణం చేసుకునే వీలుంది. దాదాపు వంద పెరటి కోళ్ల పెంపకం  షెడ్డు నిర్మాణం కోసం రూ.38 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. షెడ్డు నిర్మాణంతోపాటు ఒక వైపు గోడ నిర్మాణం పొడవు 3.75మీటర్లు రెండు వైపులా చిన్న గోడలు నిర్మించాలి. రేకులతో షెడ్‌ నిర్మాణం పూర్తి చేయాలి. 

నర్సరీల పెంపకం

జిల్లాలోని 255 పంచాయతీల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు కావాల్సిన మొక్కలను పెంచుతున్నారు. నర్సరీలో కనిష్టంగా 5వేల మొక్కలను పెంచుతున్నారు.

మల్బరీ తోటలు

వాణిజ్య పంటల వైపు రైతులు ప్రస్తుతం దృష్టి సారించిన క్రమంలో ఉపాధి హామీ పథకంలో మల్బరీ సాగు చేసేందు కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎకరంలో సాగు చేసుకునే రైతుకు రూ.39,139 అందిస్తున్నది. మల్బరీ షెడ్డు నిర్మాణానికి రూ.1,50,000 అందిస్తుంది. వీటితో షెడ్‌ నిర్మాణం, మల్బరీ సాగు సులభతరం కానుంది.

చేపల చెరువుల నిర్మాణం

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేపల చెరువులను ఉపాధి హామీలో ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించింది. ఒక్కో చెరువు తవ్వకానికి రూ.5,79,980 అందిస్తున్నది. చేపల ఉత్పత్తి కుంటలు గరిష్టంగా సమాన కొలతలతో తవ్వకాలు ఉండాలి.

ఈత వనాల పెంపకం

రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఈత వనాల పెంపకం చేపట్టకోవచ్చు. గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, నిర్వహణ ఖర్చులు, నీటి చార్జీలను ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 1000 మొక్కలను నాటడానికి రూ.50,609 సామగ్రికి రూ.2,037 అందిస్తారు. మొదటి ఏడాది సంరక్షణకు రూ.24,895 రెం డో ఏడాది రూ.27,230 ప్రభుత్వం అందిస్తున్నది.

పశువుల పాకలు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు

రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ఉపాధిహామీ పథకంలో పశువుల పాక నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.56 వేలు మంజూరు చేస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గొర్రెలను గ్రామాల్లోకి తీసుకురాకుండా, గ్రామ శివారులో షెడ్ల నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో కాపరులు షెడ్లను నిర్మించుకుంటున్నారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.52,806 చెల్లిస్తుంది.

సద్వినియోగం చేసుకోవాలి

ఈజీఎస్‌ ద్వారా కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకాన్ని విస్తరించడంతో కూలీలకు ఉపాధి కల్పిస్తూనే, గ్రామాన్ని అభివృద్ధి చేసుకొనే వీలుంది. అర్హులందరూ ఈ పథకాన్ని వినియోగించుకో వాలి. మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశంతో ఈ పథకం జిల్లాలో సత్ఫలితానిస్తున్నది. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. 

- కౌటిల్యారెడ్డి, డీఆర్‌డీవో, రాజన్న సిరిసిల్ల