బుధవారం 21 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 05, 2020 , 01:54:12

పాఠశాలలు ఇక పరిశుభ్రంగా..

పాఠశాలలు ఇక పరిశుభ్రంగా..

  • n పారిశుద్ధ్య బాధ్యత పంచాయతీలకే..
  • n జీవో జారీ  చేసిన ప్రభుత్వం
  • n ఇక స్వచ్ఛ పాఠశాలలుగా సర్కారు బడులు

సర్కారు బడులను స్వచ్ఛ పాఠశాలలు గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాఠశాలల ఆవరణలోని పారిశుద్ధ్య బాధ్యతను ఇకనుంచి పంచాయతీలకే అప్పగించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. - సిరిసిల్ల

తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఎదిగే వయసున్న విద్యార్థులకు పరిసరాలు, పాఠశాలను పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయవచ్చని భావించింది. ఇదివరకు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకొని అమలు చేశారు. పంచాయితీరాజ్‌ చట్టం -2018 ప్రకారం అన్ని పాఠశాలల మరుగుదొడ్ల శుభ్రత, పరిసరాల పరిశుభ్రత బాధ్యత ఇక పంచాయతీలదే. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇక స్వచ్ఛ పాఠశాలలు

ప్రభుత్వ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో జిల్లాలోని సర్కా రు బడులు స్వచ్ఛ పాఠశాలలుగా మారనున్నాయి. జిల్లాలో దాదాపు 505 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 111 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 334 ప్రాథమిక పాఠశాలలు, 39 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 కస్తూర్బాగాంధీ పాఠశాలలు, ఏడు ఆదర్శ పాఠశాలలు, ఒకటి అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఉన్నాయి. వీటిలో గత విద్యా సంవత్సరం 32,529 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. పాఠశాలలో అరకొరగా ఉన్న పార్ట్‌టైం స్వీపర్లతో పారిశుద్ధ్య నిర్వహణ లోపభూయిష్టంగా మారి పరిశుభ్రత నిర్వహణ కష్టతరమైంది.

ఆదేశాలు జారీ

జిల్లాలోని కొన్ని పాఠశాలలో ప్రహరీలు లేకపోవడంతో పశువులకు ఆవాసాలుగా మారి పరిశుభ్రత లోపించింది. ఇప్పటికే జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తెరిచేవరకు పంచాయతీ పారిశుద్ధ్ద్య కార్మికులతో పాఠశాలలో పనులు చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారని డీఈవో తెలిపారు. కాగా ఈ నెల 1 నుంచి డిజిటల్‌ తరగతులు ప్రారంభించిన తరుణంలో పాఠశాలలకు ఉపాధ్యాయలు హాజరవుతున్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు.logo