శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 04, 2020 , 02:08:19

రూ. 5 కే కమ్మని భోజనం

రూ. 5  కే కమ్మని భోజనం

  • n  దీనజనుల ఆకలి తీరుస్తున్న ‘తారక మంత్రం’
  • n మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్లలో అన్నపూర్ణ క్యాంటీన్‌
  • n రెండేళ్లుగా పేదలకు కడుపునిండా అన్నం
  • n లాక్‌డౌన్‌లో ఉచితంగా పంపిణీ
  • n గివ్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఆధునిక హంగులు

సిరిసిల్ల పట్టణం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ వస్ర్తాల తయారీ ఆర్డర్లతో స్థానిక నేత కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల వలస కార్మికులకు ఉపాధి కేంద్రంగా మారింది. పేదలు, వలస కార్మికులకు కడుపునిండా ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్న మంత్రి కేటీఆర్‌ బృహత్తరమైన ఆలోచనతో సిరిసిల్లలో అన్నపూర్ణ క్యాంటీన్‌ అందుబాటులోకి వచ్చింది. 5కే రుచికరమైన భోజనంతో తమ ఆకలి తీరుస్తున్న మంత్రి రామన్న నిండునూరేండ్లు సల్లంగుండాలని కార్మిక లోకం కోరుకుంటున్నది.

- రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ / సిరిసిల్ల టౌన్‌

జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కార్మిక క్షేత్రం విస్తరణ పెరిగిపోయింది. పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక అంబేద్కర్‌ చౌక్‌ ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా మున్సిపల్‌ నిధులు 6లక్షలతో అక్షయపాత్ర క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జిల్లా దవాఖాన ఇక్కడే ఉండడంతోపాటు సిరిసిల్ల-కామారెడ్డి, సిద్దిపేట రహదారుల ప్రధాన కూడలి కావడంతో అందరికీ సౌకర్యంగా ఉంటుంది. స్థానిక ప్రజలు, వాహనదారులు, విద్యార్థులతోపాటు దవాఖానలో రోగుల బంధువులకు ఉపయోగకరంగా ఉంది. 

విశేష ఆదరణ

పేదల ఆకలి తీర్చాలన్న కేటీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా రుచికరమైన శాఖాహార భోజనం అక్షయపాత్ర ద్వారా అందిస్తున్నారు. వరంగల్‌కు చెందిన ‘హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో అక్షయపాత్ర క్యాంటీన్‌లకు భోజనం సరఫరా చేస్తున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు వంటకాలతోపాటు వివిధరకాల పచ్చళ్లను భోజనం లో వడ్డిస్తున్నారు. కేవలం 5కే ప్లేట్‌ భోజనం అందిస్తుండడంతో కార్మికుల నుంచి విశేష ఆదరణ వస్తున్నది.

ఆధునిక హంగులు..

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్‌ ఆధునిక హంగులు సంతరించుకుంటున్నది. మంత్రి కేటీఆర్‌ సూచనతో గివ్‌ తెలంగాణ ఫౌండేషన్‌ సంస్థ ముందుకువచ్చి క్యాంటీన్‌ ఆధునికీకరణలో భాగస్వామ్యమైంది. నెలరోజుల వ్యవధిలో ఆధునిక హంగులతో కూడిన భవనాన్ని నిర్మించారు. ఈ నెల 25న మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు క్యాంటీన్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 950గజాల విశాలమైన స్థలంలో 21లక్షలతో క్యాంటీన్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డైనింగ్‌ హాల్‌లో ఏకకాలంలో వంద నుంచి 150మంది కూర్చొని తినే సౌకర్యం కల్పించారు. కాగా, ఈ క్యాంటీన్‌ను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ఉచితంగా భోజనం అందించారు.

నాణ్యతకు ప్రాధాన్యం

అక్షయ పాత్ర ద్వారా పేదలకు అందిస్తున్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు. ప్రతిరోజూ 540మందికి సంస్థాగత నిబంధనలతో భోజనం వడ్డిస్తున్నారు. 5 చెల్లించినవారికి 400గ్రాముల అన్నం, పప్పు 125 గ్రాములు, సాంబారు 125గ్రా, కర్రీ 100గ్రా, పచ్చడి 15గ్రా, వాటర్‌ ప్యాకెట్‌ ఇస్తున్నారు.

 నెలకు 2.70లక్షలు భారం

క్యాంటీన్‌లో నిత్యం 540మందికి భోజనం అందిస్తున్నారు. ఒక్కో ప్లేట్‌కు 24.25 ఖర్చవుతున్నది. పేదలకు తక్కువ ధరలో భోజనం అందించాలన్న లక్ష్యంతో అక్షయ పాత్రలో ప్లేట్‌ ధర 5గా నిర్ణయించారు. ఒక్కో ప్లేట్‌పై బల్దియాకు 19.25 భారం పడుతున్నది. ఈ క్రమంలో నెలకు 2.70లక్షలు బల్దియా పౌండేషన్‌ నిర్వాహకులకు చెల్లిస్తున్నది. క్యాంటీన్‌ పరిసరాలను బల్దియా ఆధ్వర్యంలో శుభ్రం చేస్తున్నారు.