గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Sep 01, 2020 , 02:25:22

‘సహకార’ సిబ్బందికి భరోసా

‘సహకార’ సిబ్బందికి భరోసా

  • lపీఏసీఎస్‌ ఉద్యోగులకు ‘ఆరోగ్య బీమా’ lచేయూతనందిస్తున్న పాలకవర్గం
  • lతెలంగాణలోనే తొలిసారిగా సౌకర్యం lఆదర్శంగా పోత్గల్‌ సంఘం

తక్కువ వేతనంతో పని చేస్తున్న సిబ్బందికి పోత్గల్‌ ప్రాథమిక సహకార సంఘం అండగా నిలుస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యబీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల కుటుంబాల్లో భరోసా నింపుతున్నది. ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ సంఘాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చింది. మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  - ముస్తాబాద్‌

పోత్గల్‌ సహకార సంఘం 1987 సంవత్సరంలో ఏర్పడింది. గత పాలకుల నిర్లక్ష్యంతో సంఘం రూ.80 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. తన్నీరు బాపురావు 2013లో సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూనే, నష్టాల బాటపట్టిన సంఘాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. మంత్రి కేటీఆర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సహకారంతో సంఘాన్ని ప్రస్తుతం రూ.20 కోట్ల టర్నోవర్‌తో లాభాల్లోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పోత్గల్‌ సహకార సంఘంలో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించారు.

బీమాతో ధీమా

సంఘంలో తక్కువ వేతనంతో పని చేస్తున్న సిబ్బందికి రిటైర్‌మెంట్‌ తర్వాత పీఎఫ్‌ తప్ప సంఘం నుంచి ఎలాంటి డబ్బూ రాదు. పని వేళల్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైనా నగదు  అవకాశం లేదు. సంఘాన్ని లాభాల్లోకి తీసుకొచ్చిన సిబ్బందికి అండగా ఉండాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంఘంలో పని చేస్తున్న 12 మంది సిబ్బందికి గత జూలై 21న రూ.28 వేలు చెల్లించి ఏడాదిపాటు ఆరోగ్య బీమా కల్పించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహకారంతో బీమా సౌకర్యం కల్పించి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తున్నది. సంఘం సభ్యులు ప్రమాదవశాత్తు గాయపడితే ఏ కార్పొరేట్‌ దవాఖానల్లో అయినా రూ.లక్ష వరకు వైద్య ఖర్చులు, అనుకోని ఘటనల్లో మరణం సంభవిస్తే రూ.7.5 లక్షల వరకు బీమా చెల్లించనున్నది.

అభివృద్ధి దిశగా అడుగులు

పోత్గల్‌ సహకార సంఘం పరిధిలో 16 గ్రామాలు ఉండగా, ఏడు వేల మంది ఖాతాదారులు ఉన్నారు. తన్నీరు బాపురావు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు సంఘం దాదాపు రూ.80 లక్షల నష్టాల్లో ఉన్నది. మంత్రి కేటీఆర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు సంఘానికి రూ.50 లక్షల రుణం అందించారు. ఆ డబ్బుతో అంచెలంచెలుగా ఎదుగుతూ నష్టాలను అధిగమించారు. ప్రస్తుతం పోత్గల్‌లో రూ.30లక్షలతో సంఘ భవనం, ఆవునూర్‌, బందనకల్‌లో ఎరువుల నిల్వలకు గోదాములు, ఆవునూర్‌, గూడెం ప్రధాన రహదారిపై కొనుగోలు చేసిన స్థలంలో పెట్రోల్‌, డీజిల్‌ పంపు నడుస్తుండగా, బందనకల్‌-ముస్తాబాద్‌ ప్రధాన రహదారిపై కొనుగోలు చేసిన స్థలంలో మరో పెట్రోల్‌, డీజిల్‌ పంపు పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం నిర్వహిస్తూ సహకారం సంఘం మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.