గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 31, 2020 , 01:03:04

ఆస్తిపన్ను వసూళ్లలో

ఆస్తిపన్ను వసూళ్లలో

పన్నుల వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా 40.95శాతం  మొదటి స్థానంలో నిలువగా, 40.89 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని  255 గ్రామ పంచాయతీలకు గాను 79 గ్రామాల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైంది. 3,87,32,101 లక్ష్యంగా ఉండగా, శనివారం సాయంత్రం వరకు 1,86,48,834 వసూలైంది. ఇంకా 2,00,83,267 వసూలు కావాల్సి ఉన్నది.

ప్రజల సుముఖత

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఆస్తిపన్నుల వసూలుకు ప్రజలు సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెరిగింది. ప్రజలు అనారోగ్యాల నుంచి దూరం అవుతున్నారు. గత ఆరు నెలలుగా కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రజలు ఇబ్బందిపడుతున్నా ఆస్తిపన్ను  చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సైతం అధిగమిస్తూ పంచాయతీ అధికారులు ప్రజల నుంచి సులభంగా పన్ను వసూలు చేస్తున్నారు. 

లక్ష్యసాధన దిశగా..

అధికారులు క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ గ్రామాన పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు పన్నుల వసూలుపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 177 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, 62 సీనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, 16మంది కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శు లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయా పంచాయతీల్లో అధికారులు, పంచాయతీ సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లలో నిమగ్నమయ్యారు.

ఆదర్శంగా 79 గ్రామాలు 

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 79 పంచాయతీల్లో వంద శాతం పన్ను వసూలు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా మిగతా జిల్లాకు ఆదర్శంగా నిలిచింది. చందుర్తి మండలంలో నాలుగు గ్రామాలు, ఇల్లంతకుంట మండలంలో రెండు, గంభీరావుపేట రెండు, కోనరావుపేటలో 28, ముస్తాబాద్‌లో 2, రుద్రంగిలో 8, తంగళ్లపల్లిలో 29, వీర్నపల్లిలో 1, వేములవాడ రూరల్‌లో 1, ఎల్లారెడ్డిపేటలో రెండుగ్రామాలు మొత్తం 79గ్రామాల్లో వంద పన్ను వసూలైంది.

గడువులోగా వసూలు చేస్తాం

ప్రభుత్వం విధించిన గడువులోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేస్తాం. పన్నుల వసూళ్లకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వసూలు చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. మిగతా గ్రామాల్లో లక్ష్యం చేరువలో ఉన్నది.

- రవీందర్‌, డీపీవో, రాజన్న సిరిసిల్ల

గ్రామస్తుల సహకారంతో..

గ్రామస్తుల సహకారంతో వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేశాం. ప్రభుత్వ పథకాలను గ్రామంలో తప్పనిసరిగా అమలు చేస్తున్నాం. ఇంటింటికీ మరుగుదొడ్లు, గ్రామంలో పరిశుభ్రత, కంపోస్ట్‌ షెడ్లు, ఇంకుడుగుంతలు తదితర ప్రజా ఉపయోగ పనులన్నింటినీ పాలకవర్గ సభ్యులతో కలిసి పూర్తి చేశాం. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించారు. 

-కే. వనజ, సర్పంచ్‌, మోహినికుంట, ముస్తాబాద్‌ మండలం