శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 30, 2020 , 02:24:51

కాలువ నిండుగా.. సాగు సంబురంగా..

కాలువ నిండుగా..  సాగు సంబురంగా..

  • మెట్ట ప్రాంతంలో పైపైకి భూగర్భజలాలు

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నది. మెట్ట ప్రాంతమైన చందుర్తి మండలానికి కాళేశ్వర జలాలను తీసుకువచ్చి, వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఒకప్పుడు బోర్లు వేస్తే నీరు లేక దుబ్బ వచ్చే ఈ ప్రాంతంలో ప్రస్తుతం రెండు గజాల్లోనే పుష్కలంగా నీరు వస్తున్నది. కాళేశ్వరం జలాలతోపాటు ఇటీవల కురిసిన వర్షాలతో ఎల్లంపల్లి కాలువ కళకళలాడుతున్నది. దీంతో సాగు విస్తీర్ణం జోరందుకున్నది. ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదని, ఇకనుంచి రెండు పంటలకు ఢోకాలేదని రైతాంగం సంబురపడుతున్నది.   - చందుర్తి

సమైక్య పాలనలో మెట్టప్రాంతమైన చందుర్తి మం డలంలో ఎన్నో ఏళ్లుగా సాగునీటి సౌకర్యాలు లేక భూములు బీడుగా మారాయి. పంటలు పండక ఈ ప్రాంత రైతులు బతుకుదెరువు కోసం గల్ఫ్‌బా ట పట్టారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మండలానికి కాళేశ్వర జలాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నిండా యి. ఒకప్పుడు బోర్లువేస్తే నీరు లేక దుబ్బ వస్తే ఇప్పుడు దాదాపు రెండు గజాల్లోనే నీరు పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి రోజులు వస్తాయాని ఈ ప్రాంత రైతాంగం ఊహించలేదు. 

నిండుకుండల్లా చెరువులు

కాలువ నీటికితోడు ఈయేడు సమృద్ధిగా వ ర్షాలు పడడంతో ఎల్లంపల్లి కాలువ నిత్యం జలకళను సంతరించుకున్నది. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. సాగుకు అవసరమైన నీళ్లు వస్తుండడంతో రెండు పంటలకు ఢోకాలేదని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

పెరిగిన సాగు విస్తీర్ణం.. 

2016-17 సంవత్సరంలో వరి పంటను కేవలం 3,472 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం 10,669 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటో ఈ గణాంకాలే నిరూపిస్తూన్నాయి. అలాగే ప్రభుత్వ సూచనల మేరకు రైతులు నియంత్రిత పద్ధతిలో 10,499ఎకరాల్లో సన్నరకం వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు.