శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 28, 2020 , 02:35:00

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

  •  n మేయర్‌ వై సునీల్‌రావు   n9, 36వ డివిజన్లలో అభివృద్ధి పనులు ప్రారంభం

కార్పొరేషన్‌: నగరాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని 9, 36వ డివిజన్లలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి రూ. 347 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటితో ఇప్పటికే నగరంలోని అనేక డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి డివిజన్‌లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నగరంలో రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు.  ఇప్పటికే ప్రధాన రహదారులతో పాటు లింక్‌, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శివారు డివిజన్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. శివారు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఇప్పటికే మినీ కూరగాయల మార్కెట్లు, అధునాతన పద్ధతిలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.  వీటితో పాటు ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. నగరంలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. అలాగే, వాకింగ్‌ ట్రాక్స్‌ అభివృద్ధి, ఓపెన్‌ జిమ్స్‌ కూడా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్‌, గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.