ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 22, 2020 , 01:36:41

ఆధ్యాత్మిక యోగం.. ఔషధ మంత్రం

ఆధ్యాత్మిక యోగం.. ఔషధ మంత్రం

ఆది దేవుడైన గణపతికి సమర్పించే ప్రతి పత్రమూ ఆరోగ్యదాయకమే.. ఔషధ గుణాల నిలయమే. సహజసిద్ధంగా లభించే ఈ పత్రాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు అనేక రుగ్మతలకు అడ్డుకట్ట వేస్తాయి. భాద్రపద శుద్ధ చవితిన మనం ఉపయోగించే ఆకులు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయి. కరోనా కాలంలో వ్యాధి నిరోధకతను పెంపొందించే ఈ ఆకుల వినియోగాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. విఘ్నేశ్వరుడి పూజకు వినియోగించే వివిధ పత్రాలు..వాటి విశిష్టతలు ఇవి..

దానిమ్మ: ఈ ఆకు తింటే చర్మం కాంతివంతమవుతుంది. వీటి రసాన్ని తాగితే అలర్జీలు తగ్గుతాయి. ఆకులు దంచి కషాయం చేసుకొని  పంచదార వేసి తాగితే దగ్గు, నీరసం, ఉబ్బసం, అజీర్తి రోగాలకు ఉపశమనం లభిస్తుంది. 

దేవదారు: దేవతలకు అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు. అజీర్తి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ చెట్టు మాను నుంచి తీసిన నూనె చుక్కలు వేడి నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

తులసీ: విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. మహాలక్ష్మీ స్వరూపం. తులసీ మొక్కలోని ప్రతి భాగం ఔషధాల మయం. చర్మ రోగాలను నయం చేస్తుంది. చిగుళ్ల బలోపేతానికి దోహదం చేస్తుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా దగ్గు, ఆయాసం తగ్గుతాయి. రోజులో 22 గంటలు ప్రాణవాయువు ఇచ్చేది చెట్టు తులసి ఒక్కటే.   

ఉత్తరేణి: ఈ ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. దీని కొమ్మలతో పళ్లు తోముకుంటే దంత వ్యాధులు నశించి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయానికి, ఫైల్స్‌కు, వాంతులకు ఔషధంగా పని చేస్తుంది. వీటి పొగ పీల్చడం వల్ల శ్యాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.

మాచీ పత్రం: ఈ ఆకులను నీళ్లలో తడిపి కళ్లకు పెట్టుకుంటే కంటి సమస్యలు దూరమవుతాయి. ఈ పత్రాలను పసుపు, నువ్వుల నూనెతో కలిపి ముద్దగా నూరి రాసుకుంటే చర్మ సంబంధ వ్యాధులు నయమవుతాయి. రక్తపు వాంతులు, ముక్కు నుంచి రక్తం కారడాన్ని అరికడతాయి. అస్తమాను నియంత్రిస్తుంది.


గరిక: ఒక్క గరికపోచ సమర్పిస్తే గణపతి మహాదానందపడిపోతాడు అని ప్రతీతి. ఇది హిస్టీరియా ఉన్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది.పచ్చడిగా చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. రక్త, చర్మ వ్యాధులను, ముక్కు నుంచి రక్తం కారడాన్ని నివారిస్తుంది.

 ఉమ్మెత్త : దీనినే దత్తూర పత్రం అని కూడా అంటారు. మానసిక రుగ్మతల నివారణ, జ్వరాలు, చర్మ రోగాలు, అల్సర్లు చుండ్రును అరికడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి విముక్తికి ఈ పత్రం దోహదం చేస్తుంది.

గన్నేరు: గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలీని పీల్చడం ద్వారా అనేక రోగాలు దూరమవుతాయి. జ్వరం వచ్చినప్పుడు గన్నేరు ఆకులు కోసి పాలు కారడం తగ్గాక తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే తీవ్రత తగ్గుతుంది.