బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 21, 2020 , 02:14:15

వేములవాడ అ‘ద్వితీయం’

వేములవాడ  అ‘ద్వితీయం’

వేములవాడ: నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ధార్మిక క్షేత్రం వేములవాడ. ఇక్కడ 40 వేలకు పైగా జనాభా ఉన్నది. ఐదారేళ్లుగా పట్టణం విస్తరిస్తున్నది. ఇదే సమయంలో మున్సిపల్‌ పాలకవర్గం, యంత్రాంగం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడమే గాకుండా తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించింది. డీఆర్సీ (డ్రై రీసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌) సెంటర్‌ నిర్వహణ, తడిచెత్తతో ఎరువుల తయారీని సైతం చేపట్టింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపునకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ దిశగా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి సత్కరించింది. వార్డులవారీగా పారిశుద్ధ్య నిర్వహణలో మెప్మా సిబ్బందిని భాగస్వాములను చేసింది. ఇలా అన్నివర్గాల సహకారంతో సుందరీకణపై దృష్టి సారించింది. తాజాగా ‘స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ మిషన్‌ -2020’ ర్యాంకులను విడుదల చేయగా, 25 నుంచి 50వేలలోపు జనాభా కలిగిన పట్టణాల్లో దక్షిణ భారతదేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును కైవసం చేసుకున్నది. 2019లో 392వ ర్యాంకుతో సరిపెట్టుకోగా, ఈ యేడు ఏకంగా నాలుగో స్థానం పొందడంపై పాలకవర్గం హర్షం వ్యక్తం చేస్తున్నది. శ్రమకు తగిన గుర్తింపు లభించిందని సంతోషంలో మునిగితేలుతున్నది.