మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 21, 2020 , 02:14:16

మెరిసిన సిరిసిల్ల

మెరిసిన సిరిసిల్ల

రాజన్నసిరిసిల్ల, నమస్తేతెలంగాణ/ సిరిసిల్ల టౌన్‌: స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ మిషన్‌-2020లో సిరిసిల్ల మెరిసింది. దక్షిణ భారతస్థాయిలో 16 వ ర్యాంకు సాధించింది. రాష్ట్రంలో నంబర్‌వన్‌ గా నిలిచింది. 50 వేల నుంచి లక్షలోపు జనాభాగల పట్టణాల విభాగంలో ఈ ఘనత దక్కించుకున్నది. కాగా బల్దియా పాలకవర్గాన్ని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం సభ్యులు ఐదు నెలల పాటు పర్యటించి తడి, పొడి చెత్త సేకరణ, పారిశుధ్య పనుల నిర్వహణ, కంపోస్ట్‌ ఎరువుల తయారీ, మరుగుదొడ్ల వినియోగం, ప్లాస్టిక్‌ నిషేధం అమలు, ఎఫ్‌ఎస్‌టీసీ తదితర అంశాలపై సర్వే చేసి వివరాలు సేకరించారు. వీటిని క్రోడికరించి గురువారం ర్యాంకులను కేటాయించగా సిరిసిల్లకు మెరుగైన స్థానం దక్కింది.    

చెత్త రహిత పట్టణం దిశగా..

తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల మోడల్‌ సిటీగా అవతరించింది. ముఖ్యంగా క్లీన్‌ సిటీగా రూపుదిద్దుకున్నది. మంత్రి కేటీఆర్‌ చొరవతో చెత్త రహితంగా తయారైంది. ఇందుకు బల్దియా ఎంతో కృషి చేసింది. కుండీల్లో చెత్త వేసే విధానానికి స్వస్తి పలికి, ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టింది. తడి, పొడి చెత్తను వేరు చేసి సాలిడ్‌ లిక్విడ్‌ మేనేజ్‌మెంట్‌ను చేపట్టింది. ప్రతిరోజూ 39వార్డుల్లో ట్రాక్టర్లు, అటోలు, ఫుష్‌కాట్లద్వారా రోజుకు 21టన్నులు, నెలకు 630 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం 277మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడాదికి నాలుగు వందల క్వింటాళ్ల పొడిచెత్తను సేకరించి రిసైక్లింగ్‌ చేస్తున్నారు.  

ఓడీఎఫ్‌ ప్లస్‌గా..

మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంలో సిరిసిల్ల పట్టణం అగ్రస్థానంలో నిలిచింది.  బల్దియా పాలకవర్గం రద్దీ ప్రదేశాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసిన వారికి జరిమానాలు విధించడంతో ఓడీఎఫ్‌ ప్లస్‌గా నిలిచింది.