శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 20, 2020 , 03:33:54

పోటెత్తిన వరద

పోటెత్తిన వరద

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ బోయినపల్లి/ తిమ్మాపూర్‌/ ఇల్లంతకుట/గంభీరావుపేట: వారంనుంచి కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లికి 46,221 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో నాలుగు గేట్లను మీట ర్‌ ఎత్తువరకు, మరో నాలుగు గేట్లను అరమీటర్‌ ఎత్తు వర కు ఎత్తి 50,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుందిళ్లలోని పార్వతీ బరాజ్‌లోకి ఎల్లంపల్లి, ఇతర వాగులు వంకల నుంచి 53,316 క్యూసెక్కుల నీరు వస్తున్నది. అక్కడ 50 గేట్లను ఎత్తి 53,316 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20.17 టీఎంసీలకు 19.06టీఎంసీల నీరు, పార్వతీ బరాజ్‌లో 8.83టీఎంసీలకు గాను 7.24టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 

ఎస్సారార్‌లో 21.66 టీఎంసీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గల శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి బుధవారం సాయంత్రానికి 1,784 క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 21.66 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 

ఎల్‌ఎండీ @ 19 టీఎంసీలు

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతుండడంతో నీటిమట్టం క్రమేణా పెరుగుతున్నది. 24.034టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయంలో బుధవారం సాయంత్రం వరకు 19.569 టీఎంసీల నీరు చేరింది. మోయతుమ్మెద వాగు నుంచి బుధవారం ఉదయం 11వేల166 క్యూసెక్కుల నీరు చేరగా, సాయంత్రం వరకు 5,560 క్యూసెక్కులకు తగ్గింది. అవుట్‌ ఫ్లో రూపంలో 285 క్యూసెక్కులు తాగునీటి అవసరాల కోసం వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

నిండుకుండలా ఎగువ మానేరు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29 అడుగులకు చేరుకోవడంతో జలకళను సంతరించుకున్నది. సిద్దిపేట జిల్లా కూడవెల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగుల ద్వారా వరద వచ్చి చేరుతున్నది. మరో రెండు అడుగులు నీరు చేరి తే ప్రాజెక్టు మత్తడి దుంకనున్నది. ప్రాజెక్టు పరిసరాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తున్నారు.