శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 17, 2020 , 01:36:24

నిండుకుండల్లా జలాశయాలు

నిండుకుండల్లా జలాశయాలు

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/బోయినపల్లి: కదిలివచ్చిన కాళేశ్వర జలాలు, భారీగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నా యి. వరదనీరు చేరుతుండడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజల ను అప్రమత్తం చేస్తున్నారు. బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం పూర్తి సామర్థ్యం 25.873 టీఎంసీలకు గానూ ఆదివారం సాయంత్రం వరకు 20.45 టీఎంసీల నీరు చేరింది. మానేరు, మూలవాగు ద్వారా 4 నుంచి 5 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు 12రోజుల పాటు రామడుగు మండ లం లక్ష్మీపూర్‌ గాయత్రీ పంప్‌హౌస్‌ ద్వారా 13 టీఎంసీల నీటిని తరలించారు. అంతకుముందు 4 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, వారం నుంచి కురుస్తున్న వర్షాలతో 3టీఎంసీల నీరు చేరింది. వరద ఉధృతి పెరిగితే  గేట్లు ఎత్తి దిగువ మానేరుకు నీటిని వదిలే అవకాశం ఉంటుందని ఎస్‌ఈ శ్రీకాంత్‌ రా వు తెలిపారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, ఇల్లంతకుంట, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలాల తహసీల్దార్లు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.  

ఎల్‌ఎండీకి పెరుగుతున్న వరద.. 

మరోవైపు దిగువ మానేరు జలాశయానికి కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. మోయతుమ్మెద వాగు నుంచి మూడు రోజులుగా నీటి ప్రవాహం వస్తున్నది. మూడు రోజుల్లో సుమారు 6 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మోయతుమ్మెద ఎగువ ప్రాం తంలో కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఒక్కరోజే ఈ వాగుద్వారా 60వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇప్పటివరకు 3టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం 23 వేల క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రం వరకు 30,546 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 15.518 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు ఇలాగే కురిస్తే మూడు నాలుగు రోజుల్లో దిగువ మానేరు నిండే అవకాశం ఉంది. దీనికితోడు మధ్యమానేరు గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలితే రేపో, మాపో  నిండే అవకాశం ఉంటుంది. ఈ జలాశ యం గేట్లు కూడా ఎత్తే పరిస్థితి రావచ్చు. 

ఎల్లంపల్లికి భారీగా ఇన్‌ఫ్లో.. 

జ్యోతినగర్‌(అంతర్గాం): ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.   ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలకు గాను ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 15.2517 టీంఎసీల నీరు ఉన్నదని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 148.00 మీటర్లకు గాను 146.15 మీటర్లకు చేరిందన్నారు. ప్రస్తుతం ఎగువన గల వాగులు, వంకల ద్వారా 12,291 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నది. ప్రాజెక్టు నుంచి 606 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎన్టీపీసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌, పెద్దపల్లి, రామగుండం పట్టణాలకు మిషన్‌ భగీరథ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.