ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 14, 2020 , 03:17:17

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మేయర్‌ వై సునీల్‌రావు అధ్యక్షతన కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన బల్దియా కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సర్వసభ్య సమావేశానికి టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం కార్పొరేటర్లు హాజరు కాగా, బీజేపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే కో-ఆప్షన్‌కు సంబంధించి జనరల్‌ విభాగంలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సమావేశానికి హాజరైన సభ్యులంతా ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థులు నందెల్లి రమ, సీహెచ్‌ అజిత్‌రావు, పుట్ట నరేందర్‌ను చేతులెత్తి ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మైనార్టీ కోటాలోని రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్‌ నుంచి  సయ్యద్‌ అమ్జాద్‌ అలీ, ఎంఐఎం నుంచి రఫియా సుల్తానాను సభ్యులంతా ముక్తకంఠంతో ఎన్నుకున్నారు. కో ఆప్షన్‌ ఎన్నికలకు సంబంధించి 16 మంది నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో-ఆప్షన్‌ సభ్యులు పుట్ట నరేందర్‌, నందెల్లి రమ, అజిత్‌రావు, రఫియా సుల్తానాతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మరో సభ్యుడు సయ్యద్‌ అమ్జాద్‌ అలీ స్వల్ప అనారోగ్యంగా ఉండడంతో హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్లు, అధికారులు, ఆయా పార్టీల నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


logo