శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 13, 2020 , 01:54:07

నేడు బల్దియా కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

నేడు బల్దియా కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

  n కలెక్టరేట్‌ ఆడిటోరియంలో   సర్వసభ్య సమావేశం

n లాంచనం కానున్న ఎన్నిక

కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో  కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం గురువారం బల్దియా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ చరిత్రలోనే మొదటి సారిగా సర్వసభ్య సమావేశం బల్దియా కార్యాలయంలో కాకుండా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులకు అజెండా కాపీలను అందించారు. ఈ సమావేశంలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ ఇప్పటికే కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఈ ఎన్నిక లాంచనప్రాయంగా కానుంది. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఐదు కో-ఆప్షన్‌ పదవులు ఉండగా వీటి కోసం 16 మంది బరిలో నిలిచారు. కాగా, నగరపాలక సంస్థ పాలకవర్గంలో టీఆర్‌ఎస్‌కు 41 మంది సభ్యుల బలం ఉండడంతో ఈ మేరకు అన్ని స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. ఇప్పటికే ఆ పార్టీ నలుగురు అభ్యర్థులు నందెల్లి రమ, సీహెచ్‌ అజిత్‌రావు, పుట్ట నరేందర్‌, సయ్యద్‌ అమ్జద్‌ అలీని ఖరారు చేసింది. మరో స్థానానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  గురువారం జరిగే సమావేశంలో లాంచనంగా ఈ అభ్యర్థులను కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హాజరవుతారని సమాచారం. 

మొదటి సారి బల్దియా బయట సమావేశం

నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఎప్పుడు కూడా బల్దియా కార్యాలయంలోని సమావేశ మందిరంలోనే నిర్వహిస్తారు. నగరపాలక సంస్థ కార్యాలయం బయట మొట్టమొదటిసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా కార్యాలయంలో ఉన్న ప్రస్తుత సమావేశ మందిరంలో స్థలం తక్కువగా ఉండడంతో ఈ సమావేశాన్ని బయట నిర్వహించాల్సి వస్తుందని మేయర్‌ సునీల్‌రావు తెలిపారు. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొవిడ్‌-19 నిబంధనల మేరకు సమావేశాన్ని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించాలని మేయర్‌ నిర్ణయించారు. ఈ ఆడిటోరియంలో సభ్యులు కొవిడ్‌-19 నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ కూర్చొవడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కో-ఆప్షన్‌ సభ్యులను పాలకవర్గ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో సభ్యుల ఎన్నికకు మాత్రమే పరిమితం కానుంది. ఉదయం 11.30 గంటలకు జనరల్‌ విభాగంలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మైనార్టీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తామని బల్దియా అధికారులు తెలిపారు. logo