శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 12, 2020 , 02:56:49

ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం

ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం

  • n  చొప్పదండి ఎమ్మెల్యే       సుంకె రవిశంకర్‌ 
  • n  కోనాపూర్‌లో పంప్‌హౌస్‌ ప్రారంభం
  • n  సూరంపేట శ్యామల చెరువులో జలహారతి

కొడిమ్యాల: ప్రతి ఎకరాకూ సాగునీరందించి అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపడమే తమ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఉద్ఘాటించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు నిర్మించి ప్రతి చెరువునూ నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఊరూరా బోర్లు దర్శనమిచ్చేవని, కానీ ఇప్పుడు ఎక్కడికెళ్లినా నీళ్లు కనబడుతున్నాయని చెప్పారు. మండలంలోని కోనాపూర్‌లో గల పోతారం రిజర్వాయర్‌ నుంచి సూరంపేట శ్యామల చెరువుకు ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యే మంగళవారం స్విచ్‌ ఆన్‌చేసి ప్రారంభించారు. అనంతరం శ్యామల చెరువులో జలహారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపర భగీరథుడిలా అనతికాలంలోనే నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించారన్నారు. ఆయన కృషితో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతున్నదన్నారు. ప్రస్తుతం నీళ్లతో నిండుకుండను తలపిస్తున్న వరదకాలువను చూసి నాడు వెక్కిరించిన ప్రతిపక్ష నేతలు నేడు నోరెళ్లబెడుతున్నారన్నారు. నియోజకవర్గాన్ని వాటర్‌ హబ్‌గా మార్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శ్యామల చెరువును నింపడం ద్వారా మండలంలోని కోనాపూర్‌ గంగారాంతండా దమ్మయ్యపేట బోల్లెన్‌ చెరువులతో పాటు మేడిపల్లి మండలంలోని గోవిందారం చెరువుకు నీరందుతుందన్నారు. ఈ నీళ్లతో సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని పేర్కొన్నారు. అంతకుముందు కోనాపూర్‌ గ్రామంలోని పంప్‌హౌస్‌ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో మల్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌, ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, కొడిమ్యాల సింగిల్‌ విండో చైర్మన్‌ మేనేని రాజనర్సింగారావు, ఎల్లంపల్లి ఈఈ సంతుప్రకాశ్‌, డీఈ రఫీ, జేఈ శ్రావణ్‌, సర్పంచులు భూక్యా బొజ్జానాయక్‌, దర్శనాల కౌసల్య, చెక్కపల్లి స్వామిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి, వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, బండ రవీందర్‌రెడ్డి , రాజేందర్‌, గంగాధర్‌ తదితరులున్నారు.


logo