శనివారం 26 సెప్టెంబర్ 2020
Rajanna-siricilla - Aug 11, 2020 , 00:44:06

రాజన్నకు శ్రావణశోభ

రాజన్నకు శ్రావణశోభ

వేములవాడ కల్చరల్‌: భక్తుల రద్దీతో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం శ్రావణ శోభను సంతరించుకున్నది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తు లు వేకువ జామునుంచే భౌతిక దూరం పాటించి, క్యూలైన్ల ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించారు. స్వామివారిని 8,653మంది భక్తులు దర్శించుకు న్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో భక్తులకు పూజలు 

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తుల గోత్రనామాల పేరిట ఆలయ అద్దాల మండపంలో పూజలు చేశారు. ఇందులో ఆలయ అర్చకులు దుమాల నాగరాజు, దేవరాజు భాస్కర్‌, కేశన్నగారి కృపాల్‌, గోపన్నగారి చందు, ఒజ్జల ఆదిత్య, బుడెంగారి మహేశ్‌, పారువెళ్ల శ్రీనాథ్‌, తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల కల్చరల్‌/ మారుతీనగర్‌:  స్వాగతం కృష్ణా.. శరణాగతం కృష్ణా.. అం టూ నందనందనుడిని ఆహ్వానించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఉట్టి సంబురాలు, ఉయ్యాల సేవలకు ఆలయాలు, ఆధ్యాత్మిక, భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాలకు కమిటీ సభ్యులు, నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు  చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడిది. అలీలమనోహరుడి జన్మదినం మహాపుణ్యదినం. శ్రీ కృష్ణుడు క్రీస్తుపూర్వ 3229 జూలై 19న బహుళ అష్టమి రోజున వృషభ లగ్నంలో జన్మించడంతో కృష్ణాష్టమి ప్రాధాన్యాన్ని సంతరించకున్నది. శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు రోహిణీ నక్షత్రం రోజున వచ్చే శ్రీకృష్ణుని జన్మదినాన్ని కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు

కృష్ణాష్టమి రోజు ఇలా..

కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాన్ని ఉంచి గీతాపారాయణం, సంకీర్తనలు, భజనలు చేపడుతారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఇంటిలో తిరుగుతుండడంతో ఆ గోపికా కృష్ణులు వచ్చినట్లు భావిస్తుంటారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలు ముగిస్తారు. 

విద్యార్థులకు పోటీలు కరువు ...

 జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భగవద్గీతపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్విజ్‌, పాటల పోటీలు, నృత్యాలు, తదితర పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుత కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూసి వేయడంతో పోటీలు కరువయ్యాయి. 

రాజన్న ఆలయంలో వేడుకలు

వేములవాడ కల్చరల్‌: రాజన్న ఆలయంలో మంగళవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు వెల్లడించారు. అనుబంధ వైష్టవాలయాల్లో అభిషేక పూజలు,అర్చనలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం శ్రీ భీమేశ్వరాలయంలో మహాప్రదోష పూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు రాజన్న ఆలయంలోని కల్యాణ మండపంలో ఉట్టి, డోలోత్సవ కార్యక్రమాలు  ఉంటాయని వారు తెలిపారు.
logo