శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 10, 2020 , 01:37:25

ఆరోగ్యానికి 'గ్రీన్‌టీ'

ఆరోగ్యానికి 'గ్రీన్‌టీ'

లేవగానే ఓ కప్పు చాయ్‌ కడుపులో పడితేగానీ ఏ పనీ చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా పూటకో కప్పు కావాల్సిందే! దారిలో ఫ్రెండు కలిసినా, ఇంటికి అతిథి వచ్చినా చాయ్‌ తాగాల్సిందే! ఒకరకంగా మనమంతా ‘టీ’కి బానిసలం. అలాగని పాలు, పంచదార, చాయ్‌పత్తితో తయారు చేసే సంప్రదాయ చాయ్‌ని తరుచూ తాగితే రోగాల పాలవడం ఖాయం. అందుకు చక్కని పరిష్కారమే గ్రీన్‌ టీ. ఇది తాగితే ఆరోగ్యం, ఆహ్లాదం మీ సొంతం.

మరెన్నో ప్రయోజనాలు..

  • గ్రీన్‌టీ పాలీఫెనోయిల్స్‌ టావ్యుర్‌ కణాల డీఎన్‌ఏ సంశ్లేషణ, ఫెరోకార్బయిడ్‌ ప్రధాన ఉత్పత్తిని నియంత్రిస్తుంది. క్యాన్సర్‌ కణాల వృద్ధిని నివారించడంతోపాటు ఆరోగ్యకరమైన ధాతువులకు నష్టం కలుగకుండా క్యాన్సర్‌ కణాలను నిర్మూలిస్తుంది. 
  • క్యాన్సర్‌, మధుమేహ నివారణకు గ్రీన్‌టీ ఉపయోగపడుతుంది. ఆంత్ర సంబంధ అవశేషాలను తగ్గించి ఇన్సూలిన్‌ కార్యకలాపాలను పెంపొందిస్తున్నది.
  • చెడు కొలెస్ట్రాల్‌ నుంచి సంక్రమించే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేస్తున్నది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉపయోగపడుతున్నది.
  • కీళ్ల మృదులాస్థికి రక్షణగా నిలుస్తుంది. కణజాల విచ్ఛిన్నతను నిలువరించి, కీళ్ల నొప్పులు రాకుండా కాపాడుతుంది.
  • కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు, తీపిపదార్థాలు) జీర్ణం కాకుండా అడ్డుకొని మనిషి బరువు పెరగకుండా సహాయపడుతుంది. 
  • శరీరంలో నిల్వ ఉన్న ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంతోపాటు రోగ నిరోధకశక్తిని పెంచి, అధిక వయస్సు కనబడకుండా చూస్తుంది.
  • గ్రీన్‌టీలో ఉండే ఫ్లోరైడ్‌తో పళ్లు బలంగా ఉంటాయి. నోట్లో వృద్ధి చెందిన బ్యాక్టీరియాను నివారించి, పళ్లకు రంధ్రాలు పడకుండా కాపాడుతుంది. 
  • రోజుకు 4 నుంచి 5 కప్పుల గ్రీన్‌టీ తాగడంతో యాంటీఆక్సిడెంట్లు వృద్ధి చెంది రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా ప్రయోజనాలుండడంతో జిల్లాలో రోజురోజుకూ గ్రీన్‌టీ ప్రియుల సంఖ్య పెరుగుతోంది. 

‘కామెట్లీయాసినేన్‌సిస్‌' అనే మొక్క ఆకుల నుంచి ‘గ్రీన్‌ టీ’ తయారు చేస్తారు. ఇతర తేయాకు తరహాలో గ్రీన్‌టీని ఉడకబెట్టకుండా, లేలేత ఆకులను ఎండబెట్టి కొద్దిసేపు ఆవిరి పట్టడంతో అందులోని ఎంజైములు(పాలీఫెనైల్‌ ఆక్సిడ్లు, పెరాక్సైడ్‌) చురుకుదనాన్ని సంతరించుకుంటాయి. గ్రీన్‌టీలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ప్రపంచంలోనే అరుదుగా లభించే మూలాధారల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రీన్‌టీలో లభించే యాంటీ ఆక్సిడెంట్లలోని విటమిన్‌ ‘సీ’, సాధారణ విటమిన్‌ ‘సీ’ కంటే వందరేట్లు అధికమని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. గ్రీన్‌టీలో లభించే విటమిన్‌ ‘ఈ’లో సైతం 25 శాతం అధిక ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. గ్రీన్‌టీ తాగడంతో చాలా వ్యాధులు నయమవుతాయనీ పలు అధ్యయనాలు చెబుతున్నాయి.