శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 10, 2020 , 01:37:38

ఇల్లాలి కృషి హరిత శోభితం

ఇల్లాలి కృషి  హరిత శోభితం

తీరొక్క తీగ మొక్కలు ఇంటినంతా అల్లుకొని పంచుతున్న ఆహ్లాదం.. ప్రహరీ చుట్టూ తీరైన పండ్ల మొక్కలు ఇస్తున్న మధురానుభూతి.. ఆవరణే వ్యవసాయ క్షేత్రమై కలిగిస్తున్న ఆనందం.. ఇవన్నీ కలగలిపి నందనవనాన్ని తలపిస్తున్న గృహం సిరిసిల్లలో చూపరులను ఆకట్టుకుంటోంది.   - సిరిసిల్ల టౌన్‌

పట్టణంలోని వెంకంపేట ఏరియాకు చెందిన గజవాడ స్వరూప, తన అభిరుచితో ఇంటినే నందనవనంలా మార్చేశారు. చిన్నప్పటి నుంచే మొక్కలంటే అమితమైన ప్రేమ ఉన్న ఆమె, భర్త నాగరాజు ప్రోత్సాహంతో తమ గృహాన్ని మొ త్తం మొక్కల పెంపకానికి అనువుగా మార్చుకున్నారు. ఆవరణలోని కొంత స్థలంలో, మేడపైన తీరొక్క మొక్కలు పెంచుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. వివిధ రకాల పూల మొక్కలను సాగు చేయడంతో పాటు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నారు. సొంతంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులతో లేయర్‌ విధానంలో మొక్కలు పెంచుతున్నారు.

ఇల్లంతా గ్రీనరీ..

2014నుంచే స్వరూప తమ ఇంటి ఆవరణలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. జామ, బొప్పాయి, అరటి, రామసీతాఫలం, సీతాఫలం, మామిడి, సపోటతో పాటు అరుదైన అంజీరా, స్టార్‌ ఫ్రూట్‌, ఆపిల్‌బేర్‌, తైవాన్‌ జామ, బెంగళూర్‌ చెర్రీ, అంగూర్‌ వంటి పండ్ల మొక్కలు, టమాట, వంకాయ, కాకర, నేతి బీర, సోరకాయ, మిర్చి, కంద, నిమ్మ, క్యాబేజీ, చామగడ్డ, తెల్లబెండ వంటి కూరగాయలను,  పాలకూర, తోటకూర, గంగవాయిలి వంటి ఆకుకూరలను, గులాబీ, మల్లె, లిల్లీ, బంతి, చంద్రకాంత, సూర్యరశ్మి, చామంతి వంటి పూల మొక్కలను పెంచుతూ ఇంటినే గ్రీనరీగా మార్చేశారు. ఆమె కృషికి మెచ్చిన ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌' కమిషనర్‌ వెంకటరాంరెడ్డి, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పలు సందర్భాల్లో జ్ఞాపికలు అందించి అభినందించారు. టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు మొక్కల పెంపకం, ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు.