మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Aug 09, 2020 , 01:18:33

సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి

సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి

వానకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. రైతులు పత్తి, వరితోపాటు ఇతర పంటలు వేయడంతో సాగు జోరందుకున్నది. వానలు కురుస్తుండడంతో అన్నదాతలు కలుపుతీసి, ఎరువులు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక సాగుకు రందీ లేదని వారు సంబురపడుతున్నారు.- కోనరావుపేట

కాలానికి అనుగుణంగా వర్షాలు పడడంతో రైతన్నలు సంబురపడుతున్నారు. విత్తనాలు నాటిన నాటి నుంచి వానలు అనుకులంగా పడడంతో వారికి సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రారంభంలో చిన్నపాటి వర్షానికే పత్తి, వరితో పాటు కంది పంటలు సాగు చేశారు. కలుపు తీసి, ఎరువులు వేయడంతో పంటలు కళకళలాడుతున్నాయి. దీంతో వానకాలంలో పంటల సాగుకు ఇబ్బందిలేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన విస్తీర్ణం

మండల వ్యాప్తంగా పత్తి, వరి, కంది, పెసర సాగుతోపాటు ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. మొత్తం 25వేలకు పైగా ఎకరాల్లో పంటలు వేశారు. 11,270 ఎకరాల్లో పత్తి, 12,696 ఎకరాల్లో వరితోపాటు 820ఎకరాల్లో కంది, పెసర పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ సారి రెండు వేల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగింద ని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సూచన మేర కు రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు.

అందుబాటులో ఎరువులు

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలో నిరంతర విద్యుత్‌, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు సాగునీరు అందిస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నది. అలాగే సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. 100-110 మెట్రిక్‌ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

ఐదెకరాల్లో పత్తి వేసిన

నా పేరు రాజు. మాది మంగళ్లపల్లి. ఐదెకరాలు కౌలుకు తీసుకున్న. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగానే పత్తి వేసిన. విత్తనాలు పెట్టినప్పటి నుంచి వానలు మంచిగ పడుతున్నయ్‌. కలుపు తీసి, ఎరువులు వేసిన. ఇప్పటికైతే పంట మంచిగున్నది. దిగుబడి కూడా బాగా వస్తదని అనుకుంటున్న. - వెలిశాల రాజు, యువరైతు, మంగళ్లపల్లి

సూచనలు పాటించాలి

రైతులు వేసిన పంటలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పూత దశలో ఉన్నా యి. యూరియా వాడకం తగ్గించి వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. చీడపీడల నివారణకు తగిన మోతాదులో ఎరువులు వాడాలి. తద్వారా అధిక దిగుబడి పొందవచ్చు.

- వెంకట్రావమ్మ, ఏవో,

 కోనరావుపేట