శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 08, 2020 , 01:14:07

ఐదో విడుత నీలి విప్లవానికి ఏర్పాట్లు

ఐదో విడుత నీలి విప్లవానికి ఏర్పాట్లు

మత్స్య సంపదను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఐదో విడుత నీలి విప్లవానికి జిల్లా యంత్రాగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా  రెండు రిజర్వాయర్లు, 405 చెరువుల్లో కోటీ 16లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. చేపల పెంపకం ద్వారా 9వేల కుటుంబాలకు ఉపాధి లభించనున్నది. త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా చెరువుల్లోకి చేపలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, మత్స్యకారుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. 

కాళేశ్వరం జలాలతో ప్రభుత్వం చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకుంటున్నది. ఈ క్రమంలో చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు 2016లో నీలి విప్లవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగేళ్లుగా మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సర్కారు ఐదో విడుతకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలో మొత్తం 625 చెరువులు ఉండగా, మధ్యమానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులున్నాయి. చేపలు పెంచడానికి 405 చెరువులు అనువుగా ఉండడంతో మత్స్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  శ్రీ రాజరా జేశ్వర జలాశయం, ఎగువ మానేరులో పెద్దఎత్తున చేపల పెంపకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కోటీ 16లక్షల విత్తన చేపలు 

గతంలో 190 చెరువులను ఎంపిక చేసిన అధికార యంత్రాంగం ఈ సారి 405 చెరువుల్లో చేపలు పెంపకానికి ప్రణాళికలు రూపొందించింది. కోటీ 16లక్షల విత్తన చేపలు వదిలాలని నిర్ణయించారు. ఇందులో శ్రీ రాజరాజేశ్వర (మధ్యమానేరు) ప్రాజెక్టులో 30లక్షలు, ఎగువ మానేరు ప్రాజెక్టులో 10లక్షల 82, 100 ఎంఎం గల చేపలను వదిలిపెట్టనున్నారు. మిగిలిన చెరువుల్లో 35,48 సెంటీమీటర్ల పొడవుగల చేపలను వదలనున్నారు. ఇందులో 35శాతం కట్ల, 35శాతం రావులు, 30 శాతం బంగారు తీగల చేపలు వేయనున్నారు. పెద్ద చెరువుల్లో 40 శాతం బొచ్చెలు, 50శాతం రావులు, 10శాతం మిరిగాల చేపలు వేయనున్నారు.   

త్వరలో ప్రారంభానికి సన్నాహాలు

జిల్లాలో ఐదో విడుత నీలి విప్లవాన్ని త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం నెలాఖరులోగా అన్ని చెరువుల్లోకి చేపలను వదిలేందుకు కార్యచరణ రూపొందించారు. నీలి విప్లవం ద్వారా సర్కారు ఉపాధి కల్పించడంతో మత్స్య కార్మికుల కుటుంబాలు సంబురపడుతున్నాయి. నీలి విప్లవం ద్వారా 78సంఘాల ద్వారా జిల్లాలో 6వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో మూడు వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.

విత్తన ఉత్పత్తి కేంద్రంగా ఎగువ మానేరు 

సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో మత్స్య కార్మిక కుటుంబాలకు మంచి రోజులు వచ్చాయి. మత్స్య సంపద పెంచడంతోపాటు వారి ఉపాధికి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. జిల్లాలో 78 మత్స్యకార్మిక సంఘాల ద్వారా మత్స్య కుటుంబాలు ఉపాధి పొందుతున్నా యి. చేపలు అమ్ముకొనేందుకు టాటా ఏస్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, వలలు, టబ్బులు వివిధ రకాల వస్తువులను ప్రభుత్వం సబ్సిడీతో అందించింది. ఇప్పటి వరకు విత్తన చేపలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ వచ్చింది. టెండర్లు వేసి కొనుగోలు చేయడంతో విత్తన చేపలు నాసిరకం రావడం, అవి పెరుగక నష్టాలకు గురిచేసింది. మన రాష్ట్రంతో పాటు రాయలసీమ, ఆంధ్రా నుంచి కూడా విత్తన చేపలు దిగుబడి చేసుకుంది. అయినప్పటికీ గిట్టుబాటు కావడం లేదు. దీంతో చేపల పెంపకాన్ని ఇక్కడే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరులో మూతపడిన విత్తన చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఆరు నెలల క్రితం పునఃప్రారంభించింది. దీని ద్వారా కొంతమేరకు  విత్తన తయారీ అవుతున్నప్పటికీ, కైకలూరు, హిమ్మత్‌నగర్‌ నుంచి కూడా దిగుమతి చేసుకునేందుకు టెండర్లు వేసినట్లు అధికారులు తెలిపారు.

 కోటీ 16లక్షల విత్తన చేపలు సిద్ధం 

జిల్లాలో 405చెరువులు, రెండు రిజర్వాయర్లలో కోటీ 16లక్షల చేప విత్తనాలు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సెప్టెంబర్‌ చివరి కల్లా జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపలను వదలాలని కార్యచరణ రూపొందించాం.- ఖదీర్‌ అహ్మద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి