గురువారం 22 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Aug 08, 2020 , 00:41:01

కరోనా చికిత్స మరింత చేరువ

కరోనా చికిత్స మరింత చేరువ

కరోనా చికిత్స చేరువ అవుతున్నది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరింత మెరుగైన సేవలందించేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తున్నది. గ్రామస్థాయిలోనే బాధితులను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు 6,350 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు రాగా, ఈ నెల 10 నుంచి రోజుకు వెయ్యి మందికి పరీక్షలను చేయనున్నది. ఇటు అమాత్యుడు రామన్న సోమవారం ఏరియా దవాఖానలో ఆధునిక సదుపాయాలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించగా, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నది.  

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ/ సిరిసిల్ల : కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. జిల్లాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానికంగానే చికిత్స అందిస్తున్నది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెరుగైన వైద్యం అందించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ 270 ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేసింది. అందులో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారి, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌శాఖలతోపాటు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసింది. ప్రతి రోజూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులకు ర్యాపిడ్‌ టెస్టులు చేయించి, పాజిటివ్‌గా తేలితే దవాఖానలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.  

మౌలిక సౌకర్యాల కోసం నిధులు..

ఈ నెల 3న ఏరియా దవాఖానలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌, మౌలిక సౌకర్యాల కోసం 2.20కోట్లను మంజూరు చేశారు. అలుపెరగకుండా సేవలందిస్తున్న శానిటేషన్‌ సిబ్బందికి వేతనాలు పెంచేందుకు, ఇతర అభివృద్ధి పనుల కోసం తన సొంత నిధులు 20లక్షలను ఇస్తానని ప్రకటించి, వెంటనే అభివృద్ధి కమిటీకి చెక్కు అందజేశారు. బాధితులను దవాఖానకు తీసుకరావడం, కోలుకున్న తర్వాత ఇండ్లకు తరలించడం కోసం తన సొంత ఖర్చులతో ఐదు అంబులెన్సులను అందించారు. వైద్యులు సరిపోని పక్షంలో ప్రైవేట్‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యులను నియమించుకోవాలని వైద్యాధికారికి సూచించారు.  

దవాఖానలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌.. 

కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానలో ఆధునిక వైద్యసదుపాయాలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 50పడకలతో సెంట్రల్‌ ఆక్సిజన్‌ కలిగిన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ సోమవారమే ప్రారంభించారు. అందులో మూడు వెంటిలేటర్లు, రెండు బైటాప్‌ మిషన్లు, పది పడకలతో కొవిడ్‌ ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు. 40 పల్స్‌ ఆక్సీమీటర్లు, 5 థర్మామీటర్లు, 2 నెబ్‌లైజర్లు, 2 సెక్షన్‌ ఆపరేటర్లు, బీపీ మీటర్లు, కొవిడ్‌ డేటా రికార్డు కోసం కంప్యూటర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు సిద్ధంగా ఉంచారు. కొవిడ్‌లో నైపుణ్య శిక్షణ పొందిన ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, సెక్యూరిటీ గార్డులు, ముగ్గురు శానిటేషన్‌ సిబ్బందిని కేటాయించారు. 

రోజుకు వెయ్యి ర్యాపిడ్‌ టెస్టులు..

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. అయితే టెస్టులు ఆ స్థాయిలో ఉండడం లేదు. మొన్నటి దాకా జిల్లాలో రోజుకు 300 మందికే పరీక్షలు చేశారు. అయితే గ్రామ స్థాయిలోనే టెస్టులను మరింత అందుబాటులోకి తెచ్చి, మెరుగైన చికిత్స అందించాలని సోమవారం జిల్లా వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. టెస్టులను వెయ్యికి పెంచాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లాకు 6,350 ర్యాపిడ్‌ కిట్లు రాగా, జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానతోపాటు రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 13 పీహెచ్‌సీలకు అవసరాన్ని బట్టి సరఫరా చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి అన్ని పీహెచ్‌సీల్లో పూర్థి స్థాయిలో పరీక్షలు చేయనున్నారు. ప్రతి వైద్యశాలలో రోజుకు 50, జిల్లా దవాఖానలో 200 నుంచి 250 టెస్టులు నిర్వహించనున్నారు. ముక్కు లేదా గొంతులో నుంచి స్వాబ్‌ తీసి ర్యాపిడ్‌ టెస్టు చేస్తారు. 20 నుంచి 30 నిమిషాల్లోపే ఫలితాన్ని తేలుస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్‌ వచ్చి, కొవిడ్‌ లక్షణాలు తగ్గకపోతే శాంపిళ్లను ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు కోసం హైదరాబాద్‌ పంపిస్తారు. ఇటు ర్యాపిడ్‌ టెస్టులు ఎలా చేయాలో? చేసిన పరీక్షలను ఏ విధంగా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలో? అనే అంశంపై జిల్లా వైద్యాధికారులు ఇప్పటికే మెడికల్‌ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి వైద్యాధికారికీ యాప్‌కు సంబంధించిన ఐడీ, పాస్‌వర్డ్‌ను అందించారు. ర్యాపిడ్‌ టెస్టుల వివరాలను వైద్యులు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

బాధితులకు పోషకాహారం.. 

ఇండ్లల్లో ఉండే అవకాశం లేని బాధితుల కోసం సర్దాపూర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో 32 బెడ్లతో ఐసొలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందు కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని కేటాయించారు. బాధితులకు ఎన్‌ 95 మాస్కులు, మూడు ప్లేన్‌ మాస్కులు, ఒక డిజిటల్‌ థర్మామీటర్‌, హ్యాండ్‌ శానిటైజర్‌, డెటాల్‌ సోప్‌, హైపోక్లోరిక్‌ సొల్యూషన్‌, చేతి గ్లౌజులు, పుకిలించేందుకు మౌత్‌ వాష్‌, చేతులు కడుక్కునేందుకు లిక్విడ్‌ సోప్‌, స్టీం కాప్యూల్స్‌ , క్యాల్షియం టాబ్లెట్లు, మల్టీ విటమిన్‌, పారాసిటమాల్‌, విటమిన్‌ సీ, జింకోవిట్‌ టాబ్లెట్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే బాధితులకు ఉచిత నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. 100ఎంఎల్‌ కషాయం, 300 గ్రాముల ఉప్మా, 300 గ్రాముల కిచిడీ, 300గ్రాముల లెమన్‌ రైస్‌, పాలు, బ్రెడ్‌, సాయంత్రం చాయ్‌ లేదా పాలు, మధ్యాహ్నం భోజనం, కూరగాయలతో కర్రీ, పప్పు, సాంబార్‌, పెరుగు, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటి పండ్లు, రాత్రి భోజనంలోనూ కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు ఉదయం సాయంత్రం అందిస్తున్నారు. ఇటు ఇండ్లల్లో ఉండి చికిత్స పొందుతున్న సుమారు 400 మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందించారు. 

52 మంది ప్రత్యేక సిబ్బంది.. 

చికిత్స అందించేందుకు ఏరియా దవాఖానలో 52 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో ఆరుగురు వైద్యులు, 18 మంది స్టాఫ్‌నర్సులు, నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఫార్మసిస్టులు, ఇద్దరు ఈసీజీ టెక్నీషియన్లు, ఇద్దరు డీఈవోలు, తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డులు, తొమ్మిది మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. బాధితులకు వైద్యం అందించడంతోపాటు మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. 

ఈ నెల 10 నుంచి పూర్తి స్థాయిలో పరీక్షలు

ముందుగా గ్రామాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలి. హోం క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి. దీంతో కరోనాను గ్రామస్థాయిలో అరికట్టవచ్చు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో టెస్టులు చేస్తున్నాం. ప్రభుత్వం 6,350 ర్యాపిడ్‌ కిట్లను జిల్లాకు సరఫరా చేసింది. టెస్ట్‌లను బట్టి అన్ని పీహెచ్‌సీలకు అందిస్తున్నాం. ల్యాబ్‌ టెక్నీషియన్‌లను నియమించుకుంటున్నాం. ఈ నెల 10 నుంచి పూర్తి స్థాయిలో కొవిడ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తాం. ఎవరైనా కరోనా లక్షణాలుంటే స్థానిక ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలి. ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలి. - సుమన్‌మోహన్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో (సిరిసిల్ల)


logo