ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 06, 2020 , 02:39:52

పంచాయతీల్లో డిజిటల్‌ కీ

పంచాయతీల్లో డిజిటల్‌ కీ

  •  lనిధుల దుర్వినియోగానికి చెక్‌
  •  lఅక్రమాలకు అడ్డుకట్ట 
  •  lపాత విధానానికి చెల్లు
  •  lఆన్‌లైన్‌లో చెక్కుల జారీ
  •  lసరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి చెక్‌ పెట్టేందుకు డిజిటల్‌ ‘కీ’ విధానంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో పాత చెక్కులకు కాలం చెల్లనుండగా,  ఇకనుంచి అంతటా ఆన్‌లైన్‌ చెక్కులనే జారీ చేయనుంది. 

- జగిత్యాల 

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధుల వర్షం కురిపిస్తుండగా అవి దుర్వినియోగం కాకుండా వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ కీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ దిశగా అన్ని గ్రామ పంచాయతీలు అడుగులు వేస్తున్నాయి.  ఇప్పటి వరకు పంచాయతీలకు నిధుల విడుదల రాత చెక్కుల రూపంలో ఉండేది. కొన్ని చోట్ల పంచాయతీ తీర్మానం లేకుండానే, నిధుల వినియోగం జరిగేది. దీంతో కొన్ని చోట్ల సర్పంచులు సస్పెండ్‌కు గురై లేదా విచారణను సైతం ఎదుర్కొన్న ఘటనలు వెలుగు చూశాయి. అక్రమాలకు కళ్లెం వేసి, నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే గతంలోనే ప్రభుత్వం సర్పంచ్‌, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వీరి సంయుక్త సంతకాలతో  డిజిటల్‌ కీ ని తీసుకువచ్చింది.  

పాత విధానానికి చెల్లు

ఇప్పటివరకు గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చు కోసం చెక్కు రాసి ఇచ్చే విధానం అమలులో ఉండేది. గ్రామ అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి చెక్‌ను ట్రెజరీ కార్యాలయానికి నేరుగా తీసుకెళ్లేవారు. అన్ని సరిగ్గా ఉండి ఆమోదం పొందితే నిధులు విడుదల చేసుకునే అవకాశం ఉండేది. అయితే తప్పుడు రికార్డులు, పనులు జరుగకున్నా చేసినట్లు చూపడం, నకిలీ సంతకాలు, ఫోర్జరీ చేసి నిధులను డ్రా చేసే అవకాశం ఉండేది. 

ఆన్‌లైన్‌ చెక్కు విధానం ఇలా..

డిజిటల్‌ కీ కోసం ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌, ఉప సర్పంచుల సంతకాల సేకరణ పూర్తయి ఇక్కడి నుంచి ప్రత్యేక లెటర్‌ ద్వారా ఎస్టీవోలకు చేరుతుంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి మీ సేవ లేదా ఇతర ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఈ-పంచాయతీ సాఫ్ట్‌వేర్‌ను పంచాయతీ కార్యదర్శులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గ్రామ పంచాయతీ వివరాలు కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్లి పంచాయతీ కోడ్‌ను నమోదు చేసి పని వివరాలు నమోదు చేయాలి. పనుల తీర్మానం కాపీని స్కానింగ్‌ చేసి ఎంబీ రికార్డు నంబర్‌, పాస్‌బుక్‌ స్కానింగ్‌ చేసి పొందుపర్చాలి. దీని విలువ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్లికేషన్‌ పూర్తయిన వెంటనే సబ్‌మిట్‌ అనే బటన్‌ క్లిక్‌ చేయగానే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ సంతకాలతో కూడిన డిజిటల్‌ చెక్‌ బయటకు వస్తుంది. దీంతో వీరి సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. డిజిటల్‌ చెక్‌ వెనకాల మరోమారు సర్పంచ్‌, ఉప సర్పంచులు ప్రత్యక్షంగా సంతకాలు చేసి ఓటీపీ నంబర్లతో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎస్టీవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తయితే ఎస్టీవో బిల్లు పాస్‌ చేస్తారు. 

అన్ని పంచాయతీల్లో అమలు

డిజిటల్‌ కీ విధానం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కొనసాగుతుంది. దీనిపై ఇదివరకే పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు అవగాహన కల్పిం చాం. ఆన్‌లైన్‌ ద్వారానే చెక్కులు జారీ చేస్తాం. ఈ విధానంతో  ప్రజాప్రతినిధుల్లో పారదర్శకతతోపాటు బాధ్యత పెరిగింది. 

-వేముల శేఖర్‌,  జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి