మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 03, 2020 , 01:23:37

ఆపత్కాలంలో సంజీవని..

ఆపత్కాలంలో సంజీవని..

  • మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌
  • సిరిసిల్లకు చేరిన ఐదు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులు
  • మరింత చేరువకానున్న వైద్య సేవలు 
  • అధునాతన సౌకర్యాలతో వాహనాలు
  • త్వరలోనే ప్రారంభించే అవకాశాలు
  • ‘రామన్న’కు జిల్లావాసుల కృతజ్ఞతలు

ఈ నెల 25న బర్త్‌ డే సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కరోనా వలలో చిక్కి విలవిలలాడుతున్న జనానికి అండగా నిలవాలని తలంచారు. తనవంతుగా సకల సదుపాయాలున్న ఆరు అంబులెన్స్‌లను అందజేస్తానని ప్రకటించారు. ఆయన బాటలో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు 100కు పైగా సంజీవని వాహనాలు అందించేందుకు ముందుకువచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత రాజన్నసిరిసిల్లకు అందజేసిన ఆరు కొవిడ్‌ రెస్పాన్స్‌ వెహికిల్స్‌ జిల్లా కేంద్రానికి చేరాయి.   

మెరుగైన సేవలు

అమాత్యుడు అందజేసిన అంబులెన్స్‌లు త్వరలోనే అందుబాటులోకి రానుండగా కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఇప్పటికే కేటీఆర్‌ చొరవతో కొవిడ్‌ నియంత్రణకు వైద్యసిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. పాజిటివ్‌ బాధితులను గుర్తించిన వెంటనే ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఒకేరోజు పెద్ద సంఖ్యలో కేసులు నమోదైన సందర్భాల్లో అంబులెన్స్‌లు లేక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ వాహనాలు అందుబాటులోకి వస్తే వైరస్‌ పీడితులు, అనుమానితులకు మరింత వేగంగా సేవలు అందనున్నాయి.

అత్యాధునిక సదుపాయాలు

మంత్రి అందజేసిన టెస్టింగ్‌ అంబులెన్స్‌ల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి.   పల్స్‌ ఆక్సిమీటర్‌, థర్మామీటర్‌, ఆక్సిజన్‌, మానిటర్‌ వంటి సౌకర్యాలున్నాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తినపుడు కృత్రిమ శ్వాసను అందించేందుకు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. థర్మామీటర్‌ను రోగి శరీర ఉష్ణోగ్రత పరీక్షకు వినియోగిస్తారు. పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా రోగి పల్స్‌రేట్‌ను తెలుసుకోవచ్చు. ఆటోమోటివ్‌ కొలాప్సెబుల్‌ స్ట్రెచర్‌ను అందుబాటులో ఉంచారు. కదలలేని స్థితిలో ఉన్న రోగిని ఇతరుల సహకారం లేకుండా సులభంగా అంబులెన్స్‌లోకి ఎక్కించడానికి వీలుగా దీనిని రూపొందించారు.  

ప్రత్యేక సిబ్బంది నియామకం

కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌ వాహనాల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బంది నియామకాల కోసం కలెక్టర్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ, 108 సంస్థ అధికారులు సంయుక్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. డ్రైవర్‌తో పాటు వైద్య సిబ్బందికి జరిగిన ఇంటర్వ్యూలకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల ద్వారా రూపొందించిన అభ్యర్థుల అర్హత నివేదికను అధికారులు కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. కలెక్టర్‌ పరిశీలన అనంతరం సిబ్బంది నియామకాలు చేపట్టనున్నారు.

త్వరలోనే అందుబాటులోకి..

కరోనా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌ సేవలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాకు చేరిన ఐదు అంబులెన్స్‌లను సర్దాపూర్‌లోని ఐసొలేషన్‌ కేంద్రంలో సిద్ధంగా ఉంచారు. రెండు, మూడు రోజుల్లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.