శనివారం 08 ఆగస్టు 2020
Rajanna-siricilla - Aug 02, 2020 , 02:32:15

స్నే‘హితులు’

స్నే‘హితులు’

మెట్‌పల్లి పట్టణానికి చెందిన కొందరు మిత్రులు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. సామాజిక సేవలో తమవంతు పాలుపంచుకోవాలని నిశ్చయించుకున్నారు. తమ స్నేహానికి గుర్తుగా 2015లో ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. ఇందులో మొదట ఎనిమిది మంది సభ్యులుండగా ప్రస్తుతం ఇందులో 60 మంది ఉన్నా రు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా సురిగి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. తలాకొంత పొగు చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం దాతలు సైతం ముందుకు రావడంతో దినదినం సేవలను విస్తరిస్తున్నారు.

పేద విద్యార్థులకు అండ..

ట్రస్ట్‌ను స్థాపించిన అప్పటినుంచి నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 1602 మంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, ఇతరాత్ర సామగ్రిని అందజేశారు. ఉన్నతవిద్య కొనసాగించలేనివారికి సైతం ఆర్థిక చేయూత నందిస్తున్నారు.

రక్తదానం

ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు ట్రస్ట్‌ సభ్యులు విశేష కృషి చేస్తున్నారు. పల్లెల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. యువతకు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 468 మందికి       రక్తదానం చేశారు.

పర్యావరణ పరిరక్షణకు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగస్వాములవుతున్నారు. ఏటా  విరివిగా మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్నారు. ఇప్పటికి వందల సంఖ్యలో మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు.

అందుబాటులో స్వర్గలోరథం, బాడీ ఫ్రీజర్‌  

మూడేళ్ల క్రితం మెట్‌పల్లి ప్రాంతంలో ట్రస్ట్‌ తరపున బాడీ ఫ్రీజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టణంతోపాటు పరిసర గ్రామాల వారికి బాడీ ఫ్రీజర్‌ను ఉచితంగా అందజేస్తూ ఔదార్యం చాటుతున్నారు. అలాగే మరణించిన వారి మృతదేహాలను శ్మశానవాటికలకు తీసుకెళ్లేందుకు స్వర్గలోక రథం పేరిట ప్రత్యేక వాహనాన్ని సమకూరుస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు.

పాఠశాలల దత్తత

మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలను దత్తత తీసుకుంటున్నారు. ఇందులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిజిటల్‌ క్లాస్‌ రూంలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, డెస్క్‌లు, పిల్లలకు పెన్నులు, నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆత్మనగర్‌ పాఠశాలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దారు.

పేదలు, అన్నార్తులకు బాసట..

యాచకులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఓమ్ని వాహనం, ఒక ద్విచక్రవాహనాన్ని ఇటీవల ప్రారంభించారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి అనాథలు, యాచకులు, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వారికి అందజేస్తున్నారు. అదే విధంగా ఇటీవల నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.   

కరోనా కాలంలో విస్తృత సేవలు

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ట్రస్ట్‌ సభ్యులు తమ సేవలను విస్తృతంగా కొనసాగించారు. భవన నిర్మాణ, ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు, సంచార కుటుంబాలకు నిత్యావసర సరకులు, ఆహార ప్యాకెట్లు, అదే విధంగా ఉచితంగా మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, సరుకులు అందజేసి వారిపై పూల వర్షం కురిపించారు. 

ఆనందంగా ఉంది

స్నేహితు లందరం కలిసి తలా కొంత వేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉంది. పేదలు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదు. మొదటగా 8 మంది సభ్యులతో ట్రస్ట్‌ను స్థాపించాం. మా సేవలు గుర్తించి చాలా మంది స్నేహితులు మేము సైతం అంటూ ట్రస్ట్‌లో సభ్యులుగా చేరారు. ప్రస్తుతం 60 మంది ఉన్నారు. మెట్‌పల్లితో పాటు మా సేవలను నిర్మల్‌, ఆర్మూర్‌, భీంగల్‌ పట్టణాల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి విస్తరిస్తున్నాం.

- సురిగి శ్రీనివాస్‌గౌడ్‌, ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు


logo