శనివారం 28 నవంబర్ 2020
Rajanna-siricilla - Aug 01, 2020 , 01:45:01

జొన్న రొట్టె తిందాం

జొన్న రొట్టె తిందాం

  • ఆరోగ్యానికి మంచి ఆహారం lపోషకాలు పుష్కలం
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు lరోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
  • కరోనా నేపథ్యంలో డిమాండ్‌

ఉరుకులు పరుగుల జీవితం.. నిత్యం ఒత్తిడితో చిత్తవుతున్న జనం.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి పోషకాహారం అవసరం. పుష్కలంగా పోషకాలున్న జొన్న రొట్టెతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.         

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ:ఆధునిక జీవితంలో లేచింది మొదలు నిద్రపోయేదాకా ఒకటే పని.. ఆకలిని మరిచి  సంపాదనపైనే ప్రత్యేక దృష్టి.. ఏం తింటున్నామో, ఎంతసేవు నిద్రపోతున్నామో తెలియని పరిస్థితి.. కొత్త కొత్త రోగాలతో దవాఖానలకు వెళ్లి కష్టార్జితాన్ని మందులకే పెట్టాల్సిన దుస్థితి.. ఇలాంటి తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే తప్ప బతికి బట్టగట్టని స్థితి.. అనేక రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రస్తుత సందర్భంలో పోషకవిలువలున్న జొన్నరొట్టెలకు ప్రాధాన్యం పెరిగింది. ఇందులో పుష్కలమైన పోషకాలు, ఫైబర్‌ కలిగి ఉండడంతో తినేందుకు జనం ఆసక్తిచూపుతున్నారు. ముఖ్యంగా మధుమేహ, బీపీ, ఊబకాయం లాంటి వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం కావడంతో రొట్టెను తినేందుకు ఇష్టపడుతున్నారు. 

గ్రామీణుల ఆరోగ్య రహస్యం.. 

స్వచ్ఛమైన వాతావరణం, మంచి ఆహారపు అలవాట్లతో గ్రామీణ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. అందు కు కారణం ఎక్కువ శాతం భోజనంలో జొన్నరొట్టెలు తీసుకోవడమేనని వైద్యు లు చెబుతున్నారు. ఉదయం ఒక పూట అన్నంతో భోజనం, రాత్రి రెండు జొన్న రొట్టెలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పట్టణవాసులు సైతం నిత్యాహారంలో జొన్నరొట్టెలు ఉండేలా చూసుకుంటున్నారు. 

రొట్టెల తయారీ కేంద్రాలు.. 

జొన్న రొట్టెలకు డిమాండ్‌ పెరగడంతో కొంతకాలంగా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఏ హోటల్లో అయినా రొట్టెలు దొరుకుతున్నాయి. ఇటీవలి కాలంలో అయితే మెయిన్‌ రోడ్ల పక్కన కూడా చిన్న సెంటర్లు కనిపిస్తున్నాయి. అక్కడే తయారు చేసి, అక్కడే విక్రయిస్తున్నారు. ఒక్కో రొట్టెను 10 చొప్పున అమ్ముతున్నారు. ఇలా రొట్టెల తయారీ ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. సాయంత్రం వేళ ఈ కేంద్రాలకు జనాలు బారులు తీరుతున్నారు. 

రోజుకు 600 రొట్టెలు అమ్ముతున్న..

నేను సిరిసిల్ల పట్టణంలో ఇరవై ఏళ్లుగా రొట్టెలు తయారు చేసి అమ్ముతున్న. రోజుకు ఆరు వందల దాకా అమ్ముతన్న. ఒకప్పుడు నేనొక్కదాన్నే ఈ వ్యాపారం చేసేదాన్ని. ఇప్పుడు 20 మందిమి ఉపాధి పొందుతున్నం. షుగర్‌ వచ్చినోళ్లకు మంచిదని డాక్టర్లు చెబుతుండడంతో మస్తుమంది జొన్న         రొట్టెలను తింటున్నరు.

- పేరాల అన్నపూర్ణ, సిరిసిల్ల  


ఆ రుచే వేరు..

జొన్న రొట్టెయినా, గట్కా అయినా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఏ కూరలైన, పెరుగైనా గట్కాతో భలే రుచిగా ఉంటుంది. గిరి గ్రామాల్లో ఇది ప్రత్యేకం. పల్లెల్లో ఇది సాధారణ వంటకమే అయినా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం జొన్నరొట్టె, గట్కా స్పెషల్‌. రొట్టె, చింతపండు తొక్కు కలిపి తింటే ఆ మజానే వేరు. మధు 

మేహ వ్యాధిగ్రస్తులకు మంచి భోజనం. చపాతి లాగే జొన్న రొట్టెను చేస్తుంటారు.