మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 29, 2020 , 01:06:19

ప్రకృతి సేవకులు

ప్రకృతి సేవకులు

వారి పథం.. పర్యావరణ హితం.. సమాజ సేవే వారి అభిమతం.. ప్రకృతి అంటే ఎంతో ఇష్టం.. వృత్తులు వేరైనప్పటికీ.. వారి ప్రవృత్తి మాత్రం ఒక్కటే కావడం విశేషం. సిరిసిల్లకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ వింధ్యా రాణి.. వ్యాపారి చింతోజు భాస్కర్‌ ప్రకృతి సేవ చేస్తున్నారు. ఓ వైపు వేర్వేరుగా ధరణి, మానేరు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి కార్మికక్షేత్రంలో జనహిత కార్యక్రమాలు చేస్తూనే.. పచ్చదనం పెంపునకు విశేష కృషిచేస్తున్నారు. హరితహారం స్ఫూర్తిగా యేటా వందలాది మొక్కలు నాటుతూ.. స్థానికంగా పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.   - సిరిసిల్ల టౌన్‌

హరితోద్యమంలో మేముసైతం అంటూ ముందుకు సాగుతున్నారీ ప్రకృతి సేవకులు.. ఓ వైపు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు హరితహారం స్ఫూర్తిగా మొక్కలు నాటుతూ.. నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

హరిత ‘భాస్కరుడు’..

జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన చింతోజు భాస్కర్‌ పట్టణంలో సంతోష్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌(టెక్స్‌మో ఇండస్ట్రీస్‌) నడుపుతున్నాడు. మానేరు స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. హరితహారం స్ఫూర్తిగా విద్యాసంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. టెక్స్‌మో ఇండస్ట్రీస్‌ సంస్థ ద్వారా ‘ట్యారో గ్రీన్‌ ప్రాజెక్ట్‌' పేరిట యేటా వెయ్యి మొక్కలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఐదు విడుతల్లో దాదాపు 5వేలకు పైగా మొక్కలు పంపిణీ చేసిన ఆయన, రోడ్డు వెంట నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులను సైతం సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. 

ఆదర్శం ఈ టీచర్‌.. 

జిల్లా కేంద్రంలోని భావనాఋషినగర్‌కు చెందిన వింధ్యారాణి అంగన్‌వాడీ టీచర్‌. సుందరయ్య నగర్‌లో పనిచేస్తున్నారు. మొదటి నుంచి పర్యావరణం.. సమాజ సేవ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ధరణి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించి పేదలకు పంపిణీ చేయడం, పాత బట్టలు సేకరించి అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’లో భాగస్వాములవుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌లో యేటా వందలాది మొక్కలు పంపిణీ చేస్తున్నారు. అందులో ఎక్కువగా పూలు, పండ్ల రకాలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రజలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు కాలనీలో 500 మొక్కలు పంపిణీ చేయగా, అవి ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. కాగా, ఈ ఆరో విడతలో  2వేల మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ధరణి సభ్యులతోపాటు వార్డులోని మహిళలు, యువజన సంఘాలను ఇందుకోసం సమాయత్తం చేస్తున్నారు.

హరితహారం స్ఫూర్తితో.. 

రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన గొప్పది. ఆయన స్ఫూర్తితోనే ధరణి సంస్థ ఆధ్వర్యంలో యేటా మొక్కలు పంపిణీ చేస్తున్నాం. నాటిన మొక్కల వద్ద ఫొటోలు దిగి వదిలేయకుండా సంరక్షణను బాధ్యతగా తీసుకున్నాం. మేం పంపిణీ చేసిన వాటిలో ఇప్పటివరకు 75శాతం మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైంది. ఈ ఏడాది మరో 2000 మొక్కలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. - వింద్యారాణి  (ధరణి స్వచ్ఛంద సంస్థ, నిర్వాహకులు)

భాగస్వాములవ్వాలి...

 ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే విజయవంత మవుతాయి. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారానికి మంచి స్పందన ఉంది. గతంలో మొక్కలు నాటి వదిలేసేవారు. కానీ ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడు సంరక్షించుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇప్పటికీ దాదాపు 5వేల మొక్కలు పంపిణీ చేశాం. భవిష్యత్‌లో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. - చింతోజు భాస్కర్‌(సంతోష్‌ ఎలక్ట్రికల్‌, ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌)